తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతినెలా పింఛను ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు (జూలై 22) ఉత్తర్వుల జారీ చేసింది. పద్మశ్రీ గ్రహీతలకు ఇక నుంచి ప్రతీ నెల రూ.25వేలు పింఛన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కనుమరుగవుతున్న కళలను గుర్తించి భావి తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప తదితరులకు ఇక నుంచి ప్రతీ నెల రూ.25 వేలు పింఛను మంజూరు చేసినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. సాంస్కృతిక శాఖ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో ఈ పింఛన్ సొమ్ము జమ అవుతుందని వివరించారు.
తెలంగాణ నుంచి ఐదుగురిని వరించిన పద్మశ్రీ…
ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ దక్కింది. దాసరి కొండప్ప (కళలు), ఏ వేలు ఆనందచారి (కళలు), జీ సమ్మయ్య (కళలు), కూరెళ్ల విఠలాచార్య, (విద్య, సాహిత్యం), కేతావత్ సోమ్‌లాల్ (విద్య, సాహిత్యం) పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా, వారికి ఫిబ్రవరిలో శిల్పారామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షన్ల గురించి ప్రకటన చేశారు.