గ్రేటర్ హైదరాబాద్, ప్రభన్యూస్ బ్యూరో : మొబైల్ మాన్సూన్ బృందం, మొబైల్ మినీ మాన్సూన్ బృందం, స్టాటిక్ లేబర్ టీమ్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇళ్లలో, రోడ్డుపై చేరిన వరద నీటిని తొలగించడం, వర్షం కురుస్తున్న సమయంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటాయి. నాలాల్లో కొట్టుకొని వచ్చిన వ్యర్థాలను తొలగించి వరద ప్రవాహాన్ని సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటాయి. ప్రధాన, అంతర్గత రోడ్లలో ఉన్న మ్యాన్‌హోల్స్ వద్ద గాని రోడ్డుపైనున్న మట్టి, ఇసుకను తొలగించి శుభ్రం చేయడమే కాకుండా అందులో నీరు నేరుగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటారు. వీరిని జోనల్, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షణ చేస్తారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో మాన్సూన్ అత్యవసర టీమ్‌లు…
మొత్తం 168 టీమ్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. అందులో 64 మొబైల్ మాన్సూన్ అత్యవసర టీమ్‌లు, 104 మొబైల్ మాన్సూన్ అత్యవసర టీమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. అందులో టీమ్‌కు ఒక వాహనం, నలుగురు కూలీలు ఉంటారు. వీరు రెండు షిప్ట్‌ల్లో 24 గంటల పాటు పని చేస్తారు. అదనంగా మరో 160 స్టాటిక్ లేబర్ టీమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. లేబర్ స్టాటిక్ టీమ్‌లో ఇద్దరు చొప్పున ఉంటారు. వీరికి అవసరమైన, సహాయక చర్యలకు కావాల్సిన సామాగ్రి అయిన గడ్డపారలు, పారలు, నీటిని తొలగించే పంపుసెట్‌లు అందుబాటులో ఉంటాయి. అత్యవసర సందర్భంలో ఈ బృందాలను ఒక ఏరియా ఇంకొక ఏరియాకు షిప్ట్ చేస్తారు. టీమ్‌లకు అవసరమైన నిలిచిన నీరు తోడేందు కు 237 పెంపు సెట్లను కూడా సమకూర్చారు. సీఆర్‌ఎంపీ ద్వారా 29మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
భద్రత ఆడిట్…
నగరంలో వర్షాకాలంలో నాలాల ద్వారా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా భద్రతాచర్యలను చేపట్టారు. అందుకోసం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాదాలు కాకుండా ఒక్కొక్క వల్వరెబుల్ పాయింట్ వద్ద ఒక్క అధికారిని నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులతో పాటు మెస్‌లను సైతం ఏర్పాటు చేశారు. జోనల్ వారీగా భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీనగర్ జోన్‌లో నాలాల్లో 74 సమస్యాత్మక లొకేషన్ లను గుర్తించగా అక్కడ 76మంది అధికారులను నియమించారు. చార్మినార్ జోన్‌లో 52 లొకేషన్‌లలో 32మంది అధికారులను, ఖైరతాబాద్ జోన్‌లో 85 లొకేషన్ ల్లో 81మంది అధికారులను, శేరిలింగంపల్లి జోన్‌లో 52 లొకేషన్‌లలో 52మంది అధికారులను, కూకట్‌పల్లి జోన్ లో 48 లొకేషన్‌లలో 49మందిని, సికింద్రాబాద్ జోన్‌లో 55 సమస్యాత్మక ప్రాంతాల్లో 79మంది అధికారులను నియమించారు. ప్రాజెక్టు వింగ్ 35 ప్రాజెక్టు పనుల వద్ద 18 మంది అధికారులను నియమించారు. పని నిరంతరంగా కొనసాగించేందుకు నీరు తొలగించడం, అవసరమైన కూలీలు, ఇసుకను సిద్ధం చేసుకోవడం, పని జరిగే చోట ప్రమాదాలు సంభవించకుండా బారికేడింగ్, హెచ్చరిక బోర్డులు, విద్యుత్‌కాంతులతో సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.
ఎస్‌ఎన్‌డీపీ…
పని జరుగుతున్న 36 ప్రదేశాల్లో భద్రత చర్యలు చేపట్టారు. అందుకోసం 18 మంది అధికారులను నియమించారు. నిరంతరం పనిని కొనసాగించేందుకు అవసరమైన మేన్ మెటీరియల్‌ను సమకూర్చారు. చెరువుల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా185 చెరువుల్లో, 19మంది అధికారులను నియమించారు. వర్షాలు కురిసే సందర్భంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కోరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.