Monday, November 25, 2024

అంతరిక్షంలోకి కోతులు.. జీరో గ్రావిటీ సంభోగ ప్రక్రియకు చైనా ప్రయోగం

అంతరిక్షంలోకి కోతులను పంపేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నది. తాను కొత్తగా నిర్మించిన టియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రానికి వీటిని పంపనుంది. సున్నా గురుత్వాకర్షణ వాతావరణంలో పునరుత్పత్తి, పెరుగుదల వంటి అంశాలను అధ్యయనం చేయడానికి అక్కడికి కోతులను పంపాలని యోచన చేస్తున్నదని తాజా నివేదిక వెల్లడించింది. ఈ పరిశోధన గురించి అంతరిక్ష కేంద్ర శాస్త్రీయ పరికరాలకు నాయకత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జాంగ్‌లూ వివరించారు. ఇది అంతరిక్ష కేంద్రం యొక్క అతిపెద్ద మాడ్యూల్‌లో నిర్వహించబడుతుంది. లైఫ్‌సైన్స్‌ ప్రయోగాలకు ఇది బీజం వేస్తుంది. ఇప్పుడున్న మాడ్యుల్‌లోని రెండు బయోలాజికల్‌ కేబినెట్‌లలో ఆల్గే, చేపలు లేదా నత్తలు మాత్రమే సరిపోతాయి. కోతుల కోసంఈ కేబిన్‌ను మరింత విస్తరించాల్సి ఉంది. ఈ ప్రయోగాలు మైక్రో గ్రావిటీ, ఇతర అంతరిక్ష వాతావరణాలకు జీవుల అనుసరణపై అవగాహనను మెరుగుపరచడానికి సహాయపడతాయి అని డాక్టర్‌ లూ పేర్కొన్నారు.

ఎలుకల ప్రయోగం విఫలం..

జీబ్రాఫిష్‌, ఇతర కీటకాలతో సహా అంతరిక్షంలో చిన్న జాతుల పునరుత్పత్తిని మునుపటి పరిశోధన అంచనా వేసింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఎలుకలు, పైమేట్స్‌ వంటి సంక్లిష్టమైన జీవన రూపాలపై ఇటువంటి అధ్యయనాలు చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. సోవియట్‌ పరిశోధకులు 18 రోజుల సంభోగ ప్రక్రియ కోసం ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు.కానీ అవి భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా పునరుత్పత్తి చేయలేదు. పెద్ద జంతువులు జీరో గ్రావిటీ వద్ద సంభోగం చేసినప్పుడు వివిధ సవాళ్లను ఎదుర్కొంటాయి. పరిశోధన సమయంలో కోతులకు ఆహారం ఇవ్వడం, వాటి మలాన్ని పారవేడయం వంటి సవాళ్లను శాస్త్రవేత్తలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. లైంగిక ప్రవర్తనపై ప్రభావం చూపకుండా ఉండేలా అంతరిక్ష కేంద్ర ఆవాసాల్లో వాటిని సౌకర్యవంతమైన పద్ధతిలో ఉంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం టియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రం ముగ్గురు (చెెన్‌డాంగ్‌, కైజుయేజ్‌, లియుయాంగ్‌) వ్యోమగాములకు నిలయంగా ఉంది. విస్తృత ప్రయోగాల కోసం దీనిని మరింత విస్తరించాలని బీజింగ్‌ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement