గుంటూరు, ప్రభన్యూస్ బ్యూరో: గుంటూరులో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో రాహువ్ నహక్(8) జీజీహెచ్‌లో చేరాడు. దీంతో, చికిత్స పొందుతున్న రాహువ్ నుంచి శనివారం రాత్రి జీజీహెచ్ అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. గొంతు, ముక్కు నుంచి స్వాబ్ తీయడంతోపాటు-, రక్తం, మూత్రం శాంపిల్స్‌ను సేకరించి ప్రత్యేకంగా భద్రపరిచారు. వ్యాధి నిర్ధారణ కోసం ఆ శాంపిల్స్‌ను ఎపిడిమాలజిస్టు డాక్టర్ వరప్రసాద్‌తో శనివారం రాత్రి 10 గంటలకు విమానంలో పుణకు పంపిస్తామని, వ్యాధి నిర్ధారణకు 3 రోజుల సమయం పడుతుందని ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు.
కాగా, ఒడిశాకు చెందిన బనిత నహక్, గౌడ నహక్‌లు తమ కుమారుడు రాహువ్ నహక్‌తో కలిసి ఒడిశా నుంచి యడ్లపాడు స్పిన్నింగ్‌మిల్లుకు 16 రోజుల కిందట వచ్చారని పేర్కొన్నారు. ఒంటిపై గుల్లలు రావడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారని, ప్రత్యేక వార్డులో బాలుడిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జిజిహెచ్‌లో మంకిపాక్స్ అనుమానితునికి చికిత్స అందిస్తుండడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు అందోళనకు గరవుతున్నారు. అయితే పుణ నుంచి పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు బాలునికి ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.