న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త ఆందోళనకు దారితీసిన మంకీపాక్స్‌పై కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం స్పందించింది. కోవిడ్-19తో పోల్చితే మంకీపాక్స్ అంత తీవ్రస్థాయి అంటువ్యాధి కాదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చైర్మన్ ఎన్.కే. అరోరా తెలిపారు. అలాగే కోవిడ్-19 తరహాలో తీవ్ర లక్షాణాలు కూడా ఉండవని స్పష్టం చేశారు. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయనన్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. కోవిడ్-19 తరహాలోనే మంకీపాక్స్ సంక్రమణపై నిఘా పెట్టినట్టు ఆయన వివరించారు.
కోవిడ్-19 కొత్త రకం కేసుల గురించి మాట్లాడుతూ.. దేశంలో బీ4, బీ5 రకం కోవిడ్-19 గుర్తించామని, అయితే స్థానికంగా ఆ రకం కేసుల వ్యాప్తి ఇప్పటి వరకు లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ తీవ్రతరం చేశామని అన్నారు. మరో వేవ్ వస్తుందని చెప్పడానికి ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసులను గమనిస్తే.. ఈ రెండేళ్లుగా ఐసోలేషన్లో ఉన్నవారే అధికంగా వ్యాధిబారిన పడుతున్నారని ఆయన తెలిపారు.