అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాలను గజగజలాడిస్తున్న మంకీపాక్స్ వైరస్, కోవిడ్ -19కు కారణమైన కరోనా వైరస్ అంత ప్రమాదకారి కాదని, నియంత్రించడం, నిరోధించడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. ఐరోపా దేశాలలో విస్తృతంగా వ్యాపిస్తుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారంనాడు డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం 20 దేశాలలో 200 కేసులు నమోదవగా 9 ఆఫ్రికన్ దేశాలలో మంకీపాక్స్ విస్తరిస్తోందని, దీనిని ప్రస్తుతానికి అంటువ్యాధిగా మాత్రమే గుర్తించామని పేర్కొంది. అయితే ఆఫ్రికా మినహా మిగతా దేశాల్లో దీనిని ఇంకా అంటువ్యాధిగా గుర్తించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మంకీపాక్స్ విస్తృతికి గల కారణాల ఇంకా తెలియలేదని, ఈ విషయాన్ని కనుగొనేందుకు పరిశోధనలు చేస్తున్నామని తెలిపింది. మశూచి వ్యాక్సిన్‌తో మంకీపాక్స్‌ను కట్టడి చేయొచ్చని భావిస్తున్న నేపథ్యంలో వ్యాధి ప్రబలుతున్న దేశాల్లో ఆ వ్యాక్సిన్లు ఎంతమేర నిల్వ ఉన్నాయో తెలీదని తెలిపింది.
పశ్చిమాఫ్రికా బయట మంకీపాక్స్ కేసులు తొలిసారిగా వెలుగుచూశాయని, ఈ పరిణామం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. మంకీపాక్స్‌ను నిరోధించడానికి, నియంత్రించడానికి చికిత్స విధానాలు, ఔషధాలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనాలా ఇది ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటువ్యాధుల విభాగం డైరక్టర్ సిల్వీ బ్రియాండ్ స్పష్టం చేశారు. సభ్యదేశాల వార్షికసదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దీనిని కట్టడి చేయడానికి సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదని, కేసులు వ్యాపించిన ప్రాంతాల్లో రోగులతో సన్నిహితంగా ఉన్నవారికి టీకాలు ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మంకీపాక్స్ వైరస్ సోకిన రోగుల శరీరంపై ఎర్రనిదద్దుర్లు, తెల్లటి నీటిపొక్కులు కన్పిస్తాయని, అయితే వారు హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితు ఉండదని, నాలుగైదు వారాల్లో తగ్గిపోతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన రోగులు, జంతువులకు దగ్గరగా మెలిగినవారికి సంక్రమిస్తోందని, కళ్లు, ముక్కు, నోరు, శరీరంపై గాయాల ద్వారా ఈ వైరస్ జొరబడుతుందని నిపుణులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశాల్లో ఏటా వేలాది మంకీపాక్స్ కేసులు నమోదవడం సర్వసాధారణమేనని, అయితే ఈసారి ఆఫ్రికాయేతర దేశాల్లో వ్యాపించడమే ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..