హైదరాబాద్, ఆంధ్రప్రభ: మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేయగా… ఇప్పుడు మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. తొలి మంకీపాక్స్ కేసు బ్రిటన్‌లో నమోదు కాగా పలు దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. మంకీపాక్స్ వైరస్ దాదాపు 12 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించింది. దీంతో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు వైరస్ వ్యాప్తిలో ఉన్న యూరప్ దేశాలు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మంకీపాక్స్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల 21 రోజుల ప్రయాణ డేటాను సేకరిస్తున్నారు. కాగా… మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిలో ఉన్న దేశాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చెప్పిం ది. అమెరికా సహా పశ్చిమ దేశాల్లో ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంది.
అనుమానిత మంకీపాక్స్ కేసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో మంకీ పాక్స్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్తం, లాలాజలం నమూనాలను సేకరించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. అనుమానిత మంకీపాక్స్ పేషెంట్లను 21 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాలని ఆదేశించింది. అనుమానిత కేసుల శాంపిళ్లను పూణలోని ల్యాబ్‌కు పంపనుంది. మంకీపాక్స్ ప్రారంభంలో మీజిల్స్, మశూచి, చికెన్ పాక్స్ లాగా కనిపిస్తుంది. ఆరంభంలో జ్వరం, తలనొప్పి, శరీరంపై వాపు, వెన్ను, కండరాల్లో నొప్పి, శోషరస గ్రంథుల వాపు, చలి, అలసట, న్యూమోనియా, ఫ్లూ లక్షణాలు వెంటాడుతాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం క్రమంగా పెరిగి శరీరమంతా బొబ్బలు వ్యాప్తి చెంది, చిట్లి పుండ్లు పడుతాయని వివరిస్తున్నారు. అయితే ఈ వైరస్ సోకినా అతి కొద్ది మందిలోనే విషమంగా మారుతుందని వైద్య, ఆరోగ్యవాఖ పేర్కొంది. నోరు, ముక్కు, చర్మం నుంచి ఈ వైరస్ శరీరంలోకి చేరుతుందని చెప్పింది.
ప్రస్తుతం యూరప్ దేశాలతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మంకీపాక్స్ ను గుర్తించారు. మంకీపాక్స్ సాధారణ వైరస్ అని బ్రిటన్ చెబుతోంది. మశూచి టీకా ద్వారా ఈ వైరస్‌ను 85శాతం కట్టడి చేయొచ్చని పేర్కొంది. వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండడం, వారి దుస్తులు వాడడం, ఆ వ్యక్తి శరీర స్రావాల ద్వారా ఇతరులకు సోకుతుంది. చేతి శుభ్రత పాటించడం, మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.