న్యూయార్క్: మంకీపాక్స్ కేసులు భయపెడుతున్నాయి. బ్రిటన్ తరువాత ఇప్పుడు అమెరికాలో కూడా ఓ కేసు నమోదైంది. మసాచుసెట్స్ ఆరోగ్య అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కెనడాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిందనీ, ప్రస్తుతం ఆసుపత్రిలో ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నామని వారు తెలిపారు. ఈ వ్యక్తికి ఈ వ్యాధి ఎలా సోకిందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలియజేశారు. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తానికి ఒక్క కేసే వెలుగులోకి వచ్చిందని, కంగారుపడాల్సిందేమీ లేదని తెలియజేశారు. అమెరికాలో ఈ ఏడాది నమోదైన తొలి మంకీపాక్స్ కేసు ఇదే. నిజానికి అమెరికాలో ఈ వ్యాధి కనుగొనడం ఇదే తొలిసారి కాదు. గత నవంబర్‌లో మేరీల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇది సోకింది. నైజీరియా వెళ్లివచ్చిన తరువాత ఈ వ్యాధి సోకినట్లు అప్పట్లో తేలింది. బ్రిటన్‌లో కూడా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మే 6వ తేదీన ఇక్కడ తొలి కేసును కనుగొన్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 9కి చేరుకున్నది. పోర్చుగల్, స్పెయిన్‌లలో కూడా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ అనేది ఓ వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండండం వల్ల ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ను మొదటి సారి 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించారు. 1970లలో మనుషుల్లో ఇది బయటపడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..