Thursday, November 21, 2024

Monkey fever: వ‌ణికిస్తోన్న మంకీ ఫీవర్‌… కర్ణాటకలో ఇద్దరు మృతి

మొన్న‌టివ‌ర‌కు క‌రోనా…ఆ త‌ర్వాత దాని వేరియంట్లు..ఇలా కొత్త కొత్త వేరియంట్లు ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి నుంచి కొంత ఉప‌శ‌మ‌నం పొందామ‌నుకున్న స‌మ‌యానికి మ‌రోక‌టి అవ‌తార‌మెత్తుతుంది. దీంతో ప్ర‌జ‌లు ఏ వేరియంట్ల బారీన ప‌డ‌తామోన‌ని హ‌డ‌లెత్తిపోతున్నారు. ఇలాంటిదే తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రంలో చోటుచేసుకుంది. మంకీఫీవ‌ర్ ఆ రాష్ట్రాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజా మంకీఫీవ‌ర్ బారీన ప‌డి ఇద్ద‌రు మృతి చెందారు.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) మంకీ ఫీవర్ తో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ రణ్‌దీప్‌ తెలిపారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలపై ఆరా తీశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 48 మందికి మంకీ ఫీవర్‌ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.

కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి సోకుతుందని రణ్ దీప్ తెలిపారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఈ వైరల్ లక్షణాలను వెల్లడించారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు ఐసీఎంఆర్‌ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement