Monday, November 25, 2024

చించోలిలో కోతుల సంరక్షణ కేంద్రం.. పంటలకు తగ్గుతున్న వానర బెడద

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కోతుల బెడద అంతా ఇంతాకాదు.., ముఖ్యంగా అదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వాటి బెడద మిగతా జిల్లాల కంటె ఎక్కువ. వంద కాదు,రెండు వందలు కాదు ఏకంగా వేల ఎకరాల్లో వేసిన పంటలను నాశనం అయిన ఘటనలు ఉన్నాయి. పంట పొలాల వద్దనే కాదు, ఇండ్లు, దేవాలయాల వద్ద వాటి బారిన పడి పెద్ద సంఖ్యలో జనం గాయపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 72,133 ఎకరాల్లో రైతుల వేసిన పంటలు దెబ్బతిన్నాయి. వనాలు వదలి.., పొలాలు.., జనాల మీదికి వస్తున్న వానరసేనను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతుల నుండి వచ్చిన డిమాండ్‌ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్మల్‌ జిల్లా చించోలి వద్ద కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని మంజూరు చేశారు. ఈ కేంద్రం ద్వారా కోతి చేష్టల కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు కొంత మేరకు సఫలమవుతున్నాయి. నిర్మల్‌ సమీపంలోని చించోలి వద్ద రూ. 148.51 లక్షల వ్యయంతో 2001 లో ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం సత్ఫలితాలనిస్తోంది.

- Advertisement -

దేశంలోనే ఇది రెండో పునరావాస కేంద్రం కావడం విశేషం.. ఇంతకు మునుపు ఇలాంటి కేంద్రాన్ని హిమాచల్‌ప్రదేశ్‌లోని సివ్లూవద్ద ఏర్పాటు చేశారు. చించోలి వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రైలు బోగీల మాదిరిగా 4 కంపార్ట్‌ మెంట్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌ లో 50 చొప్పున మొత్తం 200 కోతులకు సర్జరీలు చేసేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కోతులకు సంతానోత్పత్తి జరగకుండా పశుసంర్థక శాఖకు చెందిన వైద్యులు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఆడకోతులకు లాప్రోస్కోపిక్‌, మగ కోతులకు వాసెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. సర్జరీల తర్వాత వాటిని జనావాసాలకు దూరంగా అడవుల్లో వదులుతున్నారు. ఇప్పటి వరకు ఈ కేంద్రంలో 2204 కోతులను చేర్చుకుని వాటిలో 608 మగకోతులు, 282 ఆడకోతులకు స్టెరిలైజేషన్‌ చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.కోతులకు ఆహారం, నీరు, వైద్య సంరక్షణకై రూ.28.20 లక్షలు ఖర్చు చేశారు.

అడవుల నుంచి జనారణ్యంలోకి రాకుండా అటవీ ప్రాంతంలో మంకీ ఫుడ్‌కోర్టు పేర ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయడం విశేషం. హరితహారం పథకం కింద అడవుల్లో దేశీయ పండ్ల చెట్లను పెంచడంతో పాటు తాగునీటి సౌకర్యాలు కల్పించి వాటికి ఆకలిబాధ తీర్చేందుకు ఈ ఫుడ్‌ కోర్టులను అభివృద్ధి చేస్తోంది. నర్సరీలలో 20 శాతం పండ్ల మొక్కలు ఉండేలా ప్రాధాన్యత ఇస్తున్నది. కోతులను పట్టుకుని విడిచిపెట్టేందుకు అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం సరళం చేసింది. గతంలో రాష్ట్ర కార్యాలయం నుంచి అనుమతులు పొందిన తర్వాతే వాటిని పట్టుకోవాల్సిఉండేది. ప్రస్తుతం రీజినల్‌ ఫారెస్టు అధికారులకు అధికారం దఖలు చేశారు. అదే విధంగా కోతులు పట్టుకునే వారికి ఆర్థిక సహాయాన్ని స్థానిక సంస్థల ద్వారా అటవీ శాఖ అందిస్తోంది. రహదారులు, అటవీ ప్రాంతాల్లో వెళ్లే రోడ్లు, దేవాలయాల సమీపంలో వాటికి ఆహారం పెట్టరాదని బోర్డులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల అదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందున ఆయన ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. అయితే, ఈ ఒక్క కేంద్రం సరిపోదని, మరి కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో సైతం ఇల్లు పీకి పందిరివేస్తున్న వానరసేనను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం తన నియోజకవర్గంలో కోతుల వల్ల జరుగుతున్న నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. చించోలితో పాటు అదనంగా మరి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement