దేశ వ్యాప్తంగా వేర్వేరు సోదాల్లో ఈడీ అధికారులు రూ.3 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారని ఇదంతా ప్రజల సొమ్మే అని.. వారికి దక్కడమే న్యాయమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం బీహార్‌లోని నవడాలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేయడంపై మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను మోదీ తప్పుపట్టారు.
జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం కాదా అని ప్రశ్నించారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ, ఇక్కడ ప్రజల వద్ద జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ఆయన తన ప్రసంగంలో 370వ అధికరణను పొరపాటున 371వ అధికరణగా పేర్కొనడం కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రధాని బీజేపీ ఎన్నికల ప్రచార సభలో తప్పుపట్టారు. ”జమ్మూకశ్మీర్ అంశం ప్రస్తావనకు తగదని ఆయన (ఖర్గే) అనుకుంటారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పదవి అంటే చిన్న పదవేమీ కాదు. రాజస్థాన్ వచ్చి 370వ అధికరణను ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ఆయన అనడం సిగ్గుచేటైన వ్యవహారం. జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం కాదా?” అని మోదీ నిలదీశారు.
కాంగ్రెస్ జాగ్రత్తగా వినాలి..
కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా వినాలని, బీహార్‌కు చెందిన ఎందరో యువకులు, సాహసికులు తమ మాతృభూమి కోసం, జమ్మూకశ్మీర్‌ను రక్షించేందుకు ప్రాణాలు పోగొట్టుకుని అమరులయ్యారని, రాజస్థాన్‌లోనూ ఎంతోమంతి ఆత్మబలిదానాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు దేశంలోని ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి సంబంధం ఏమిటని అడుగుతున్నారని, ఇది టుక్డే-టిక్డే గ్యాంగ్ భాషకాకపోతే మరేమిటిని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను క్షమించవచ్చా? అని సభికులను ఉద్దేశించి మోదీ ప్రశ్నించగా, పలువురి ”లేదు” అంటూ సమాధానం ఇచ్చారు. నవడాలో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సీపీ ఠాకూర్ తనయుడు వివేక్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 19న మొదట విడత పోలింగ్‌లో భాగంగా నవడా, గయ, ఔరంగాబాద్, జముయి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.