ఈశాన్య రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రేపు (ఆదివారం) మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని పర్యటిస్తారు. దాదాపు రూ.6800 కోట్ల విలువైన ప్రాజెక్డులను చేపడతారు అని ఇవ్వాల (శనివారం) పీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్‌ఈసీ) స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
1972లో ఏర్పాటైన ఎన్‌ఈసీ వివిధ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఈశాన్య ప్రాంతాల్లో విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాల్లో పౌరుల అభివృద్ధికి కృషిచేస్తోంది. స్వర్ణోత్సవ వేడుకల అనంతరం ప్రధాని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో 4జీ నెట్‌వర్క్ టవర్లను జాతికి అంకితం చేస్తారు. షిల్లాంగ్‌లోని ఉమ్‌సాలిలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ను ప్రధాని ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి త్రిపుర చేరుకుంటారు. రూ. 4350 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద రూ.3400 కోట్ల వ్యయంతో నిర్మించిన గృహ సముదాయాలను ప్రారంభించనున్నారు. దాదాపు 2 లక్షల మందికి గృహ నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత అగర్తల బైపాస్ రోడ్డు విస్తరణను ప్రారంభిస్తారు. పీఎం గ్రామ్‌సడక్ యోజన కింద 230 కి.మీ. పొడవైన 32 రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆనందర్‌నగర్‌లోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఆగర్తలలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీలను ప్రధాని ప్రారంభించనున్నారు.