బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన హింసాత్మక ఘటనలు… ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. ఈ క్రమంలో ఆమె ఢాకా నుండి పారిపోయి భారతదేశానికి చేరుకుంది. పొరుగు దేశం కావడంతో బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తుంది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు అత్యవసరంగా సమావేశమైంది.
ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా, బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీకి భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వివరించారు. దీంతో తాజా పరిస్థితులు, స్థానికంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష జరిపినట్లు సమాచారం.
మరోవైపు బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు, హసీనా రాజీనామా నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ హౌస్లో భారత విదేశాంగ మంత్రిని కలిశారు. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక పొరుగు దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్-బంగ్లా వాణిజ్యానికి తాత్కాలిక బ్రేక్ పడింది. నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన వాణిజ్యం నిలిచిపోయింది.