Friday, November 22, 2024

Delhi | మండే వేసవిపై మోదీ సమీక్ష.. పంటలపై ప్రభావం గురించి అధికారుల ప్రజెంటేషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రతికూల వాతావరణం కారణంగా ఆహార ధాన్యాల కొరత రాకుండా వీలైనంత ఎక్కువ నిల్వ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సూచించారు. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణుల వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఆయన తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి, భూ విజ్ఞాన శాస్త్ర విభాగం కార్యదర్శి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సభ్య కార్యదర్శి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తొలుత అధికారులు రానున్న కొన్ని నెలల్లో వాతావరణం ఎలా ఉంటుందన్న విషయంతో పాటు ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా పెరిగిన ఉష్ణోగ్రతల గురించి ప్రధాన మంత్రికి ప్రజెంటేషన్లతో సహా వివరించారు. రబీ పంటపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం గురించి కూడా అధికారులు ప్రధానికి తెలియజేశారు. ఈ క్రమంలో పంటలకు సాగు నీటి లభ్యత, సరఫరా, పశువులకు దాణాతో పాటు తాగునీటి లభ్యత వంటి అంశాలపై ప్రధాని సమీక్షించారు. అలాగే వాతావరణంలో వేడి తీవ్రత పెరగడం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం, వేడి కారణంగా తలెత్తే విపత్తుల నిర్వహణ, వివిధ రాష్ట్రాల సన్నద్ధత, ఆస్పత్రుల్లో తగిన మౌలిక వసతులు వంటి అంశాల గురించి కూలంకశంగా చర్చించారు.

మండు వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు, వైద్య నిపుణులకు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు వంటి స్థానిక సంస్థలకు, విపత్తు నిర్వహణ సిబ్బందికి విడివిడిగా సూచనలు, అవగాహన పెంపొందించే సమాచారాన్ని రూపొందించి పంపిణీ చేయాలని ప్రధాన మంత్రి అధికారులకు సూచించారు. తీవ్ర వేడి వాతావరణాన్ని ఎదుర్కోవడంపై చిన్నారులకు మల్టీమీడియా విధానంలో కొన్ని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కూడా సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జింగిల్స్, షార్ట్ ఫిల్మ్స్, కరపత్రాలు సహా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు.

- Advertisement -

మరోవైపు భారత వాతావరణ శాఖకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్ని సూచనలు జారీ చేశారు. వాతావరణ హెచ్చరికలు, సూచనల గురించి వాతావరణ శాఖ ప్రతిరోజూ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సమాచారాన్ని విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ వాతావరణం గురించి వివరించడంతో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం టీవీ ఛానెళ్లు, ఎఫ్.ఎం రేడియోల్లో ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించే అంశంపై కూడా ప్రధాన మంత్రి అధికారులతో చర్చించారు.

అలాగే ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఎంత మేర పాటిస్తున్నారన్నది తెలుసుకోవాలని, ఆ మేరకు సమగ్ర ఫైర్ ఆడిట్ జరిపించాలని ప్రధాని సూచించారు. ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాల నేపథ్యంలో ప్రధాని ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అగ్నిమాపక వ్యవస్థ, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలన్న అంశాలపై మాక్ డ్రిల్స్ నిర్వహించేలా సంసిద్ధం చేయాలని సూచించారు. అలాగే అడవుల్లో చెలరేగే మంటలు, కార్చిచ్చు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ప్రధాన మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు.

పెరుగుతున్న వేడి కారణంగా పశువులకు దాణా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అలాగే దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలతో పాటు విపత్కర పరిస్థితుల్లోనూ ఆహార కొరత ఏర్పడకుండా ఆహార ధాన్యాలను వీలైనంత ఎక్కువగా నిల్వ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ను ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement