Tuesday, November 26, 2024

Delhi: మోదీ జన్మదినం సేవకు అంకితం.. ప్రధానికి దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు: నిర్మలమ్మ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలకు అంకితం చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. శనివారం ఉదయం ఢిల్లీలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అక్టోబర్ 2న జరిగే గాంధీ జయంతి వరకు పక్షం రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు దేశమంతటా కొనసాగుతాయని వెల్లడించారు. ప్రతి కార్యకర్త ఒక క్షయ రోగిని దత్తత తీసుకోవడమో లేక రక్తదానం చేయడమో.. ఇలా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడని అన్నారు. ఈ సందర్భంగా మోదీ గురించి మాట్లాడుతూ.. ఆయనకు దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని, నేషన్ ఫస్ట్ (దేశమే మొట్టమొదటి ప్రాధాన్యత) అనే విధానంతో పనిచేస్తారని నిర్మల సీతారామన్ అన్నారు.

దేశంలోని ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వావలంబన కల్పించే దశలో భాగంగా జన్ ధన్ ఖాతాలు తెరిచి పేద ప్రజలను బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా తీసుకొచ్చారని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు చేరడంలో జన్ ధన్ ఖాతాలు కీలకంగా మారాయని ఆమె వెల్లడించారు. గతంలో ఒక పేదవాడికి కేంద్ర ప్రభుత్వం రూ. 100 మంజూరు చేస్తే, కేవలం రూ. 15 మాత్రమే అతనికి చేరేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఎంత మంజూరు చేస్తే అంత నేరుగా పేదవాడి ఖాతాకు చేరుతుందని, మధ్యలో ఎలాంటి లీకేజికి ఆస్కారం లేకుండా చేశారని నిర్మల అన్నారు.

ముద్ర పథకం ద్వారా చేతి వృత్తులపై ఆధారపడ్డవారి నుంచి మొదలుపెట్టి చిరువ్యాపారులు, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం పూచీతో రుణాలు మంజూరు చేస్తున్నామని అన్నారు. తద్వారా ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరు రుణాలు పొందగల్గుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఉదంతాలను గుర్తుచేస్తూ.. తాను నర్సాపురంలో ఉన్న రోజుల్లో కూరగాయల వ్యాపారులు ఉదయం ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారి దగ్గర రూ. 100 రుణంగా తీసుకుంటే, రూ. 90 మాత్రమే ఇచ్చేవారని, సాయంత్రానికి మళ్లీ రూ. 100 తిరిగివ్వాల్సి ఉండేదని అన్నారు.

రోజుకు 10శాతం వడ్డీతో చిరువ్యాపారులు తీవ్ర దోపిడీకి గురయ్యేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వెల్లడించారు. ఆర్థికంగా ప్రతిఒక్కరినీ బలోపేతం చేయడంతో పాటు అందరికీ ఆరోగ్యం అందించే దిశగా కూడా ప్రధాని మోదీ ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టారని ఆమె కొనియాడారు. అలాగే ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంతింటిని అందించే దిశగా అనేక రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. అను నిత్యం దేశం కోసం, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించే మోదీకి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement