Wednesday, November 20, 2024

షాంఘై శిఖరాగ్ర సదస్సుకు మోడీ.. హాజరుకానున్న రష్యా, చైనా అధ్యక్షులు

ఈనెల 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన 15 మంది అగ్రనేతలు సదస్సులో పాల్గొంటారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో రెండు రోజులపాటు సదస్సు జరుగుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా పలువురు ప్రపంచ నాయకులు సమావేశానికి హాజరవుతారు. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన తర్వాత, తొలిసారి ఈ సమావేశంలో నేతలు వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు. చివరిసారి 2019 జూన్‌లో కిర్గిస్తాన్‌లోని బిష్‌కెక్‌లో వ్యక్తిగత సమావేశం జరిగింది. 2020, 2021లో సదస్సు వర్చువల్‌గా నిర్వహించారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ప్రధాని మోడీ 14వతేదీన సమర్‌కండ్‌ చేరుకుంటారు. 16వ తేదీన అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. సమర్‌ఖండ్‌ శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత ఎస్‌సిఒ తదుపరి అధ్య పదవిని చేపట్టనున్న నేపథ్యంలో ఈ సదస్సు భారత్‌కు కీలకమైంది. సెప్టెంబర్‌ 2023 వరకు ఈ గ్రూపునకు భారత్‌ ఏడాదిపాటు అధ్యక్ష పదవిని కలిగివుంటుంది.

కాబట్టి వచ్చే ఏడాది శిఖరాగ్ర సమావేశానికి న్యూఢిల్లి ఆతిథ్యం ఇవ్వనుంది. సమర్‌ఖండ్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. షెడ్యూల్‌ చేయబడిన ద్వైపాక్షిక సమావేశాలపై అధికారిక సమాచారం లేనప్పటికీ, నేతలు ఒకే హాలులో సమావేశం అవుతారని తెలుస్తోంది. జిన్‌పింగ్‌, మోడీ ముఖాముఖి గురించి స్పందించేందుకు బీజింగ్‌ నిరాకరించింది. అయితే, తూర్పు లడఖ్‌లోని సంఘర్షణ తర్వాత ఇటీవలి పరిణామాలు, ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని ఇరుదేశాలు భావిస్తున్నాయి. తాష్కెంట్‌కు 300 కిమీ దూరంలోని సమర్‌ఖండ్‌లో సదస్సు కోసం గత ఆరు నెలలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్‌సిఒ 2001 జూన్‌లో స్థాపించబడింది. ఇందులో ప్రస్తుతం 8 సభ్యదేశాలు (చైనా, ఇండియా, రష్యా, కజకిస్తాన్‌, కిర్గిస్తాన్‌, పాకిస్తాన్‌, తజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌) ఉన్నాయి. నాలుగు పూర్తిస్థాయి సభ్యత్వ పరిశీలన దేశాలు (అఫ్గాన్, బెలారస్‌, ఇరాన్‌, మంగోలియా), ఆరు సంభాషణ భాగస్వామ్య దేశాలు (ఆర్మేనియా, అజర్‌బైజాన్‌, కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, టర్కీ) సదస్సులో పాల్గొంటాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement