Tuesday, November 26, 2024

రాజ్యసభలో మోడీ కంట కన్నీరు…

న్యూఢిల్లీ – రాజ్యసభలో పదవీకాలం ముగుస్తున్న సభ్యుల గురించి ప్రధాని మోడీ మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గురించి మాట్లాడేటప్పుడు మోడీ కంటతడి పెట్టుకున్నారు. మోడీ కళ్ల వెంట కన్నీరు రావడంతో రాజ్యసభ అంతా గంభీరంగా మారిపోయింది… సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆజాద్ దేశానికీ అందించిన సేవలను ప్రధాని కొనియాడారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిమంతుడని వ్యాఖ్యానించారు. ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర సభ్యులు, భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఆజాద్ పనితీరును అందుకోవడం చాలా కష్టమని కితాబిచ్చారు. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్ కోసం ఆయన పనిచేశారని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని మోడీ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కశ్మీర్‌లో ఓసారి ఉగ్రదాడి జరిగినప్పుడు గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకునిపోయిన విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆజాద్‌తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంతగా శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగానికి గురయ్యారు. తన సొంత కుటుంబసభ్యులు చిక్కుకుంటే ఎంత శ్రమిస్తారో, ఆజాద్ అంత శ్రమించారని అన్నారు. ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తారు, కానీ ఆ వచ్చే వ్యక్తి ఆజాద్ పనితీరును మరిపించాలంటే చాలా కష్టమని అన్నారు. ‘గులాంనబీ ఆజాద్‌ నాకు మించి మిత్రుడు.. నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు మాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది.. మేమిద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం.. అంతకుముందే ఎన్నోసార్లు కలసుకున్నాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారు. ప్రకృతితో మమేకం అవుతారు.ఉద్యానవనాల విషయంలో ఆయనకు అపార పరిజ్ఞానం ఉంది.. పదవులు వస్తుంటాయి. అధికారం దక్కుతుంది. కానీ వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి నేర్చుకోచ్చు” అని మోడీ వ్యాఖ్యానించారు. ప్రధాని మాట్లాడుతున్నంత సేపూ గులామ్ నబీ ఆజాద్ ముఖళిత హస్తాలతో నమస్కరిస్తూ కనిపించారు. అంతకు ముందు షంశేర్ సింగ్ మన్హాస్ గురించి మాట్లాడిన మోడీ, ‘నా ప్రసంగాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను ఆయనతో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. మా పార్టీ బలోపేతానికి ఆయనతో కలసి స్కూటర్ పై ప్రయాణించిన రోజులు నా మదిలో ఇంకా మెదులుతున్నాయి. రాజ్యసభలో ఆయన హాజరు అద్భుతం.. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నేను ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను’ అని చెప్పారు. వారితో పాటు నజీర్ అహ్మద్ లావే, మొహమ్మద్ ఫయాజ్ తదితరుల సేవలనూ ప్రధాని కొనియాడారు.

మేం అజాద్ ను నామినేట్ చేస్తాం ….మంత్రి రాందాస్ అథవాలే
రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విషయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల్లోనే రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేయనున్న ఆజాద్‌కు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘‘మీరు కచ్చితంగా మళ్లీ సభలోకి ప్రవేశించాలి. కాంగ్రెస్ మిమ్మల్ని నామినేట్ చేయకపోతే, మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేయడానికి మేం సిద్ధమే. రాజ్యసభకు మీ అవసరం ఉంది.’’ అని అథవాలే ఆజాద్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా గులాంనబీ ఆజాద్ వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 15 తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అథవాలే పై ప్రకటన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement