Saturday, September 28, 2024

Follow up | హస్త కళాకారులకు అండగా మోడీ.. రూ.13 వేల కోట్లతో విశ్వకర్మ యోజన ప్రారంభం

ఇబ్రహీంపట్నం, (కృష్ణా) ప్రభ న్యూస్‌: హస్త కళాకారులకు అండగా నిలిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రూ.13 వేల కోట్లతో విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలోని శ్రీ మద్విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ యజ్ఞ మహోత్సవానికి ఆదివారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా హస్తకళల రంగం వల్ల ఉపాధి లభిస్తుందని చెప్పారు.

విశ్వకర్మ యోజన ద్వారా హస్త కళాకారులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు సులభ వడ్డీకే రుణాలు అందించనున్నట్లు తెలిపారు. కళాకారులు పనిముట్లు కొనుగోలుకు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.10 వేలు అధిక వడ్డీలకు తీసుకొని చెల్లించలేని పరిస్థితిలో వారి ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

కళాకారులకు అవసరమైన మెటీరియల్‌ నుంచి తయారు చేసిన ఉత్పత్తిని విక్రయించే వరకు విశ్వకర్మ యోజనలో అంతర్భాగమైనట్లు వివరించారు. సేవకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ ద్వారా అందరికీ సంక్షేమాన్ని అందించి అభివృద్ధి, ప్రగతి పథంలో నడవాలనే పిలుపు మేరకు ప్రజా సేవకు అంకితమైనట్లు వివరించారు.

ప్రతి కార్యకర్త ఈ పక్షం రోజులు ప్రజా సేవ చేసి తరిస్తారన్నారు. నరేంద్ర మోడీ అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బీసీ కమిషన్‌ అంటూ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ప్రారంభించారని, వాటి ద్వారా ఎంతమందికి మేలు జరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement