భారతీయ రైల్వే లేటెస్ట్‌గా 16వ వందే భారత్ రైలును ప్రారంభించింది. పూరీ-హౌరా రూట్‌లో వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఒడిషా రాష్ట్రానికి ఇది తొలి వందే భారత్ రైలు కావడం విశేషం. హౌరా నుంచి ఇప్పటికే మరో వందే భారత్ రైలు నడుస్తోంది. వందే భారత్ రైళ్ల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ విధించారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే నెలలో అన్ని రాష్ట్రాల్లో వందే భారత్ రైలు ప్రారంభం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్టు తెలిపారు. జూన్ నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన తెలిపారు.
ఇక 100 కిలోమీటర్ల లోపు ప్రతీ రోజూ ప్రయాణించేవారి కోసం వందే మెట్రోను తీసుకొస్తున్నామని కూడా అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వందే మెట్రో రైలును తయారు చేసి వచ్చే ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే కసరత్తు చేస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పూరీ-హౌరా రూట్‌లో తాజాగా వందే భారత్ రైలు ప్రారంభమైంది. జూన్ చివరి నాటికి మరో నాలుగు రూట్లల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందులో న్యూజల్పాయ్‌గురి-గువాహతి, పాట్నా-రాంచీ రూట్స్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అంతే కాకుండా ముంబై-గోవా రూట్‌లో కూడా వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.
ఈ రైలు ప్రారంభమైతే గోవాకు ఇది తొలి వందే భారత్ రైలు అవుతుంది. గురువారం ముంబై-గోవా వందే భారత్ రైలు ట్రయల్ ప్రారంభమైంది. ట్రయల్ రన్ పూర్తైన తర్వాత ముంబై-గోవా రూట్‌లో వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ముంబై నుంచి గాంధీనగర్, సాయినగర్ షిరిడీ, సోలాపూర్ రూట్‌లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు రూట్లను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ఇవి కాకుండా భువనేశ్వర్-హైదరాబాద్ రూట్‌లో వందే భారత్ రైలు నడపాలని ఒడిషా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ రైలు ప్రారంభమైతే తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి రూట్లల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి రూట్‌లో మొదట 8 బోగీలతో వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఇటీవలే ఈ రైలును 16 బోగీలతో నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.06:35 PM