విపక్షాల ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విరుచుకుపడ్డారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారి హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా మోడీ పూర్తి శక్తితో పోరాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండియా కూటమి’ని ఏర్పాటు చేశారని, వారు మోడీని భయపెడదామని భావిస్తున్నారు, కానీ నేను నా భారతదేశం, నా కుటుంబాన్ని అవినీతిపరుల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటానని ప్రధాని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన తొలి ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ప్రధాని నియంతృత్వ విధానాలను అవలంభిస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరించేందుకు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలో మహా ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అవినీతికి వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకోవడంతో కొంతమంది విస్తుపోతున్నారని, నా దేశాన్ని అవినీతిపరుల నుంచి రక్షించడానికి నేను పెద్ద యుద్ధం చేస్తున్నాని పీఎం అన్నారు. అవినీతికి పాల్పడిన వారు కటకటాల వెనక ఉన్నారు, సుప్రీంకోర్టు నుంచి కూడా బెయిల్ పొందలేరు అని అన్నారు. అవినీతి నిర్మూలనకు ఎన్డీయే కట్టుబడి ఉందని, అవినీతి నేతల్ని రక్షించడానికి ఇండి కూటమి దృష్టిసారించిందని, అవినీతిని తొలగించాలా..? లేదా.. అని మీరే తేల్చుకోవాలని ప్రధాని మీరట్ సభలో అన్నారు.
మోడీపై ఎంత దాడి చేసినా, ఎంత పెద్ద అవినీతిపరుడైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని, దోచుకున్న వాడు ఖచ్చితంగా దేశానికి తిరిగి ఇవ్వాలని ప్రధాని అన్నారు. కచ్చతీవు ద్వీప వివాదాన్ని లేవనెత్తిన ప్రధాని మోడీ, దేశ సమైక్యత, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదని, ‘విక్షిత్ భారత్’ని రూపొందించడానికి ఉద్దేశించినవని, రాబోయే 5 ఏళ్ల కోసం తమ ప్రభుత్వ రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు.
గత 10 ఏళ్లలో మీరు అభివృద్ధికి సంబంధించి ట్రైలర్ మాత్రమే చూశారని, ఇప్పుడు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌తో పాటు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, ఇటీవల ఎన్డీయేలో చేరిన రాష్ట్రీ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి ప్రధానితో వేదిక పంచుకున్నారు.