Saturday, November 23, 2024

Delhi | డిగ్రీ పట్టాయే కాదు.. నైపుణ్యాలూ మీ సొంతం ! ‘నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్‌’ను ప్రశంసించిన మోదీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నూతన విద్యా విధానం’లో భాగంగా ఏర్పాటైన ‘నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బుద్ధ చంద్రశేఖర్ ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. తాను రూపొందించిన పోర్టల్‌ను ప్రధాన మంత్రి మెచ్చుకోవడంపై బుద్ధ చంద్రశేఖర్ స్పందించారు. ప్రధానికి కృతజ్ఞతలు చెబుతూ తన స్పందనను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన బుద్ధ చంద్రశేఖర్, పోర్టల్ ఆవశ్యకత గురించి వివరించారు. ఇప్పటి వరకు చదువుకున్నవారికి డిగ్రీలు మాత్రమే చేతికొచ్చేవని, కొన్ని పేరుమోసిన విద్యాసంస్థల్లో చదువుకున్నవారు మినహా చాలామందిలో ఉద్యోగాలకు అవసరమైన ఇతర నైపుణ్యాల కొరత ఉండేదని గుర్తుచేశారు.

- Advertisement -

ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ నైపుణ్యాల కొరత కారణంగా అటు ఉద్యోగార్థులు, ఇటు పరిశ్రమలు ఇబ్బందిపడుతుండేవని అన్నారు. అయితే విద్యార్థులను ఆయా రంగాల్లో నిపుణులుగా మార్చే సరికొత్త విద్యావిధానం కారణంగా డిగ్రీ పట్టా చేతికి అందే సమయానికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు కూడా తెలిసిన మానవ వనరులు సిద్ధంగా ఉంటాయని బుద్ధా అన్నారు. ఈ క్రతువులో ‘నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్’ విద్యాసంస్థలకు, పరిశ్రమలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చి, ఒక వారధిలా ఉపయోగపడుతుందని, లక్షలాది మంది యువతకు నైపుణ్యాలను అందజేస్తూ, పని అనుభవాన్ని అందజేస్తుందని తెలిపారు.

విద్యార్థులు, పరిశ్రమలు సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించిన ఈ పోర్టల్ అభివృద్ధి వెనుక వెన్నుతట్టి నడిపించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి, ఏఐసీటీఈ ఛైర్మన్ ప్రొ. సీతారాం, NETF ఛైర్మన్ ప్రొ. అనిల్ సహస్రబుద్ధెతో పాటు తన బృందంలో పనిచేసిన సభ్యులందరికీ బుద్ధ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. 2025 నాటికి 1 కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించాలన్న లక్ష్యంతో పోర్టల్ రూపొందించినట్టు ఆయన తెలిపారు. ఉద్యోగ కల్పనతో పాటు అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలతో పాటు వ్యాపార దృక్పథం పెంపొందించడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా మారుతుందని అభిప్రాయపడ్డారు

ఈ పోర్టల్‌ గురించి బడ్జెట్ అనంతర వెబినార్లో మాట్లాడిన ప్రధాని మోదీ, పోర్టల్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అటు పారిశ్రామికవేత్తలకు, ఇటు విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు అవసరాలను తీర్చేలా నూతన విద్యా విధానం రూపొందిందని, సంక్లిష్టంగా ఉన్న భారతీయ విద్యా వ్యవస్థను ఇది సులభతరం చేసిందని అన్నారు. ఈ విధానంలో విద్యతో పాటు నైపుణ్య శిక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు.

ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్‌ల కోసం ‘నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్’ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రధాని పారిశ్రామిక, విద్యారంగ సంస్థలకు సూచించారు. ఈ పోర్టల్‌లో ఇప్పటి వరకు 75 వేల సంస్థలు నమోదయ్యాయని, అవి 25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించాయని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు స్టైపెండ్ ఇవ్వడం కోసం బడ్జెట్ కేటాయింపులు చేశామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలో భారతదేశాన్ని తయారీ రంగానికి కేంద్రంగా మార్చే లక్ష్యంలో భాగంగా ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0’ పథకం లక్షలాది మంది యువతను నిపుణులుగా మార్చనుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement