Wednesday, November 20, 2024

రాహుల్‌కు మోడీ ఫోబియా.. గోవాలో వచ్చేది బీజేపీయే : అమిత్‌ షా

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి మోడీ ఫోబియా పట్టుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. గోవాలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 22కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బోరిమ్‌లోని సాయిబాబా ఆలయంలో అమిత్‌ షా ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ కూడా ఉన్నారు. పోండాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. గోవాను కాంగ్రెస్‌ ఓ వెకేషన్‌ స్పాట్‌గా చూస్తోందన్నారు. తాము మాత్రం అభివృద్ధికి దోహదపడుతున్నామని స్పష్టం చేశారు. గోవా భవిష్యత్తును మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు గోవాలో అస్థిరత ఉండేదన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే.. ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. గోవాలోని రాజకీయ పార్టీలన్నీ అధికారం కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. తాము మాత్రం అభివృద్ధికి బాటలు వేసేందుకు చూస్తున్నామన్నారు. టీఎంసీ, ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు గోవాను అభివృద్ధి చేయలేవని అన్నారు. ఇక్కడి ప్రజలు గత ప్రభుత్వంతో పాటు బీజేపీ సర్కార్‌ పాలనను గమనిస్తున్నాయని చెప్పుకొచ్చారు. గోవాలో 40 అసెంబ్లి స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement