హైదరాబాద్, ఆంధ్రప్రభ: పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో బీజేపీ ఇందుకు సంబంధించిన వ్యూహరచన చేస్తోంది. ఎన్నికల కోడ్‌కు ముందుగానే తెలంగాణలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల సమరశంఖాన్ని ప్రధాని మోడీతో పూరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దాదాపు ఈనెలాఖరున సభను నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఈ నెలాఖరున వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఒకవేళ అలా అవ్వకుంటే.. వచ్చే నెల మొదటి వారంలో కోడ్ అమలయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే కోడ్‌కు ముందే.. వీలైనంత త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. రథయాత్రల ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ రావాలని రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌కు రిక్వెస్ట్ పెట్టింది. అయితే దానికి సంబంధించి అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రథయాత్రలు సైతం మార్చి 1వ తేదీతో పూర్తవుతాయి. అన్ని యాత్రలను హైదరాబాద్‌లోనే ముగించేలా పార్టీ ప్లాన్ చేస్తోంది.
ఈక్రమంలోనే మోడీ షెడ్యూల్‌ను సరిచూసుకొని మార్చి 4వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారైతే ఆదిలాబాద్, ములుగు, సికింద్రాబాద్ పరిధిలో ఆయన విజిట్ చేసే అవకాశముందని సమాచారం. ఈ పర్యటనలో ములుగులో గిరిజన యూనివర్సిటీ, ట్రిపుల్ ఆర్ పనుల శంకుస్థాపన, ఎస్సీ రిజర్వేషన్‌పైనా మోడీతో కీలక ప్రకటనను చేపించే అవకాశమున్నట్లు సమాచారం. సభను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సారి పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి కీలకం కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అందుకుగాను పదేళ్ల తమ పాలనలో ఇప్పటి వరకు తెలంగాణకు ఏమిచ్చామనే వివరాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. గత ప్రభుత్వాలు రాష్ట్రానికి ఏమిచ్చాయి… తాము వచ్చిన తర్వాత ఏమిచ్చామో… పథకాల వారీగా ఎన్ని నిధులు కేటాయించామనే అంశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తామని గతంలో మోడీ తెలిపారు.
కాగా, ఈసారి దానిపైనా స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ-ల పైనా ఆయన స్పందించే అవకాశముంది. తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల అంశాన్ని సైతం మోడీ ప్రస్తావించే అవకాశముంది. మోడీ పర్యటనలో భాగంగా చర్లపల్లి టర్మినల్‌ను విజిట్ చేసి ప్రారంభించే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోడీ పర్యటన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి ఎంత మేరకు బూస్ట్ అవుతుందనేది చూడాల్సి ఉంది