బెంగుళూరు – కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరపున వన్ మ్యాన్ షోగా దూసుకుపోతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా విపక్ష కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బజరంగ్ దళ్ రద్దు అంశాన్ని బజరంగ్ భలిగా మలిచి మంచి మైలేజ్ సాధించిన ఆయన తాజాగా ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాపై చెలరేగుతున్న అంశాన్ని ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ పై ప్రయోగిస్తున్నారు..
బళ్లారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ ”ది కేరళ స్టోరీ సినిమా ఉగ్రకుట్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా తీవ్రవాదంలోని దుర్మర్గమైన కోణాన్ని చూపిస్తుంది. ఉగ్రవాదం ఎలా పని చేస్తోందని, వారి రూపకల్పన ఎలా జరుగుతుందనే నిజాన్ని బహిర్గం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదంపై తీసిన ఈ సినిమాని వ్యతిరేకిస్తోంది. ఉగ్రధోరణలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని కాపాడింది” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రమూకలకు ఆశ్రయం ఇస్తోందని, ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదాన్ని కాపాడిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ప్రసంగంలో పదే పదే ది కేరళ స్టోరీ మూవీలోని పలు అంశాలను ప్రస్తావించారు..