Friday, October 18, 2024

Modi | ఎన్డీఏ కూటమి సీఎంలతో మోడీ భేటీ..

ఛండీగఢ్‌ : ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం భేటీ అయ్యారు. హర్యానా సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోడీ.. అనంతరం ఛండీగఢ్‌లో సీఎంలతో సమావేశమై పలు కీలక అంశాలపై సీఎంలతో చర్చించినట్లు తెలుస్తున్నది.

ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరైనట్టుగా తెలుస్తున్నది. ఎన్డీఏకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు, 16 మంది డిప్యూటీ సీఎంలు ఈ భేటీలో పాల్గొన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. దాదాపు 4 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. గత కొన్నేళ్లలో ఈ తరహా ఎన్డీఏ సీఎంల సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ సమావేశానికి హర్యానా సీఎం సైనీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌, అసోం సీఎం హిమంత బిస్వ శర్మ, నాగాలాండ్‌ సీఎం నైఫియు రియో, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి, అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణు దేవ్‌ సాయి, మేఘాలయ సీఎం సంగ్మా, మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, సిక్కిం సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సాహా సహా పలు రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు.

అలాగే బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా సైతం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు- ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. అదేవిధంగా అమృత్‌ మహోత్సవ్‌పైనా కూడా సీఎంలతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తున్నది.

ఈ కార్యక్రమంపై సీఎంల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిసే ఉన్నాయన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు ఈ సీఎంల సమావేశాన్ని వినియోగించుకుంటున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

సంక్షేమాలపై విస్తృతంగా చర్చించాం : మోడీ

ఎన్డీఏ కూటమి సీఎం కౌన్సిల్‌ సమావేశం గురువారం ఛండీగఢ్‌లో జరిగినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్‌ పేజీలో షేర్‌ చేశారు. ‘ఈ సమావేశంలో గుడ్‌ గవర్నెన్స్‌తోపాటు ప్రజల జీవన విధానాలు మెరుగుపర్చడం, వివిధ సంక్షేమాలను తీసుకురావడంపై విస్తృతంగా చర్చించాం. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై తమ కూటమి కట్టుబడి ఉన్నది ‘ అని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement