ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా పేరుపొందిన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గురించి మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. ఆయన జీవితంలో జరిగిన అద్భుమైన ఘట్టాల గురించి తెలుసుకోవాలనే ఆతృత ప్రతీ ఒక్కరికి ఉంటుంది. విన్నవి, ప్రచారంలో ఉన్నవి, మనం ప్రత్యక్షంగా తెలుసుకున్నవి కాకుండా.. మోడీ జీవితంలోని అనూహ్య, ఆసక్తికర, స్ఫూర్తిదాయక అంశాలతో మోడీ స్టోరీ పేరుతో ఓ వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. మహత్మా గాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి శనివారం మోడీ స్టోరీ పోర్టల్‌ను ఆవిష్కరించారు. బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు మోడీ స్టోర్ వెబ్‌సైట్ విశేషాలను షేర్ చేశారు. ఇందిరా గాంధీ పాలనలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోడీ మారువేశంతో పోలీసులకే మస్కా కొట్టిన విషయం చాలా కొద్ది మందికే తెలుసు.
అమ్మ చేతిలో చివాట్లు..
ఎమెర్జెన్సీ కాలంలో.. సిక్కు మతస్తుని మాదిరిగా దుస్తులు వేసుకుని.. పోలీసుల నుంచి తప్పించుకున్నారు. పగడీతో సర్దార్జీ మాదిరిగా బట్టలు వేసుకుని.. మోడీ ఓ సారి బయటకు వెళ్లారు. అప్పుడు ఓ పోలీసు ఆయన దగ్గరికే వచ్చి.. నరేంద్ర మోడీ ఎక్కడ ఉంటాడని అడగ్గా.. మోడీనా.. ఆయనెవరో నాకు తెలీదు అంటూ మస్కా కొట్టేశారు. ఆ ఇంట్లోకి వెళ్లి అడిగి చూడండి అంటూ ఉచిత సలహా ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నారు. ఆ వెంటనే.. అగర్వాల్ సోదరుడి స్కూటర్ ఎక్కి మోడీ పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ఈ విధంగా వస్త్రాలు ధరిస్తూ.. ఆయన చాలా మందిని మాయ చేశారని మోడీ సన్నిహితుడు ఒకరు చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ చిన్నప్పుడు చెరువులో మొసలి పిల్లను పట్టుకొచ్చి అమ్మ చేత చివాట్లు తినడం, వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మడం, బాల్య వివాహంలో ఇమడలేక భార్యను వదిలేయడం, ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి దేశాటన చేయడం.. ఎమర్జెన్సీలో మారువేషాలతో తిరగడం.. ఎమ్మెల్యే కాకుండానే.. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అవ్వడం.. ఇలా ఎన్నో విషయాలు మోడీ స్టోర్ వెబ్‌సైట్‌లో ఉంటాయి.
పోర్టల్‌లో మోడీ జ్ఞాపకాలు..
నరేంద్ర మోడీతో సన్నిహితంగా మెలిగిన వారు.. స్నేహితులు.. కుటుంబ సభ్యులు.. ఆప్త మిత్రులు.. వారి జ్ఞాపకాలు, వారు చెప్పే కథనాలు మోడీ స్టోరీ పోర్టల్‌లో ఉంటాయి. కొందరు నెటిజన్లు స్వచ్ఛందంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మోడీని కలిసిన వారు తమ జ్ఞాపకాలను తమతో పంచుకోవచ్చని.. వ్యాసాలు, ఆడియో లేదా విజువల్ స్టోరీస్, చిన్న కథలు, మోడీతో ఫొటోలు, ఆయన రాసిన లేఖలు లేదా వ్యక్తిగత జ్ఞాపకాలు వంటివి పంపించొచ్చని వెబ్‌సైట్ నిర్వాహకులు తెలిపారు. ఈ సైట్‌లో గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మోడీ చదువుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ రాస్ బిహారీ మణియార్, 90వ దశకంలో ఆయనకు ఆశ్రయం కల్పించిన శారదా ప్రజాపతి వంటి వారు ఎంతో మంది మోడీతో తమ అనుబంధాలను పంచుకున్నారు. ఒలింపిక్ బంగారుపతక విజేత నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు మరికొంత మంది క్రీడాకారులు కూడా మోడీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...