కరోనా వేళ భారత్‌లో నెలకొన్న పరిస్థితులను, కొనసాగుతోన్న సహాయక చర్యల గురించి రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఈ రోజు ప్రసంగించారు. వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తులు ఎదుర్కొంటున్నాం. కరోనా, తుపాను బాధితులకు అండగా నిలుస్తున్నాం’ అని మోదీ చెప్పారు. తుపాను నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొని లక్షలాది మందికి సేవలు అందించిన వారికి తాను సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు. వారి సేవలు అభినందనీయమని చెప్పారు. ఇక తుపాను ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి పని చేశాయి. గతంలో కంటే తక్కువ ప్రాణనష్టం జరిగింది. సహాయక చర్యల్లో పాల్గొన్న వారి సేవలు అభినందనీయం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఇక కరోనా కట్టడి చర్యల గురించి మోదీ ప్రస్తావించారు. దూర ప్రాంతాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయటం కష్టంగా మారింది. క్రయోజనిక్ ట్యాంకర్ డ్రైవర్ల శ్రమ ద్వారా లక్షల మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణ రోజుల్లో రోజువారీ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి 900 మెట్రిక్ టన్నులుగా ఉండేది. అది ఇప్పుడు పది రెట్లు పెరిగి దాదాపు 9,500 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.