కేరళలోని వయనాడ్ లో ఎన్నిప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ చాంపియన్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని… ఈవీఎంలపై విపక్షాలతోపాటు.. ప్రజలకు నమ్మకం పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పోలింగ్ కు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తుంటే మనదేశంలో మాత్రం ఈవీఎంలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు అడిగే కనీస హక్కు బీజేపీకి గానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గానీ లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దక్షిణాదికి ఏమిచ్చారని ఓటు వేయాలని ప్రశ్నించారు. అబ్ కీ బార్ 400 పార్ అనే స్లోగన్ వినడానికి బాగానే ఉన్నప్పటికీ.. అన్ని సీట్లు రాబోవని ధీమా వ్యక్తం చేశారు.
తన 10 సంవత్సరాల హయాంలో దేశాన్ని మోదీ భ్రష్టు పట్టించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా భారత్‌లో అంతర్భాగమేనని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో మోదీ ఎందుకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తోన్నారు?.. గుజరాత్‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని నిలదీశారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ మంత్రి.. వంటి కీలక పదవుల్లో దక్షిణాది వారిని ఎంపిక చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడో నిషేధించాయనీ పేర్కొన్నారు. వాయనాడ్‌లో పోటీలో ఉన్న ఎల్డీఎఫ్ అభ్యర్థికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు అండగా నిలిచారని విమర్శించారు.