Monday, November 25, 2024

మోడీ అబద్దాలకోరు.. యూపీఏ హయాంలోనే ప్రాజెక్టు చీతా చేపట్టాం: జైరాం రమేష్‌

అంతరించిపోయిన చిరుత పులుల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు నిర్మాణాత్మక కృషి చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ గట్టిగా గళమెత్తింది. ప్రాజెక్టు చీతా గురించి వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు 2009లో యూపీఏ ప్రభుత్వం రాసిన లేఖను బయటపెట్టింది. ”మన ప్రధాన మంత్రి అబద్ధాలకోరు. భారత్‌ జోడో యాత్రలో ఉండటం వల్ల నిన్న (శనివారం) ఈ లేఖ గురించి చెప్పలేకపోయాను” అని జైరాం ఆదివారం ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు 2009నాటి లేఖను కూడా జత చేశారు. ప్రాజెక్ట్‌ చీతాకు నాంది ఈ లేఖ అని తెలిపారు.

ప్రాజెక్టు చీతాకు పచ్చ జెండా ఊపుతూ అప్పట్లో వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు రాసిన లేఖ ఇది. చిరుత పులులను తిరిగి తీసుకురావడం కోసం సవివరమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఈ ట్రస్ట్‌ అధికారి డాక్టర్‌ ఎంకే రంజిత్‌ సింహ్‌ను ఈ లేఖలో కోరారు. వీటిని పెంచడానికి తగిన ప్రదేశాలను కూడా తెలియజేయాలని కోరారు. ఈ అధ్యయనంలో రాష్ట్ర అటవీ శాఖలను కూడా భాగస్వాములను చేయవచ్చునని తెలిపారు. 2010 జనవరి నెలాఖరుకు ఈ రోడ్‌మ్యాప్‌ను పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించాలని పేర్కొన్న విషయాన్ని జైరాం రమేష్‌ ఈ సందర్భంగా తెలిపారు.

వాళ్లు మూర్ఖుల స్వర్గంలో ఉన్నట్లే..
కాంగ్రెస్‌ పార్టీ లేకుండా విపక్షాల ఐక్యత ఉండదని జైరాం రమేష్‌ నొక్కిచెప్పారు. కాంగ్రెస్‌ రహిత ఫ్రంట్‌కు ప్రయత్నాలు చేసేవారిని మూర్ఖుల స్వర్గంలో జీవిస్తున్నావారిగా దెప్పిపొడిచారు. గతంలో చాలా ప్రాంతీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను పంచింగ్‌ బ్యాగ్‌గా వాడుకున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ లేకుండా, ఏదైనా బీజేపీయేతర కూటమి ఐదేళ్ల సుస్థిర ప్రభుత్వాన్ని అందించగలదని భావిస్తే, అది మూర్ఖుల స్వర్గంలో జీవిస్తున్నట్లేనని విమర్శించారు. ఆప్‌ను బీజేపీ బి టీమ్‌ అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని పెద్ద ఏనుగుగా అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement