Friday, November 22, 2024

Bihar: న‌లంద కొత్త క్యాంప‌స్ ను ప్రారంభించిన మోదీ…

17 దేశాల రాయ‌బారులు హాజ‌రు
క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లో బోది వృక్షం నాటిన ప్ర‌ధాని
న‌లంద భార‌తీయులు ఆత్మ అంటూ కితాబు

బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడి నుంచి కొత్త క్యాంపస్‌కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అగ్ని జ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు’ అని పేర్కొన్నారు. నలంద కేవలం భారతదేశ పునరుజ్జీవన భూమిక మాత్రమే కాదు. దీనికి ప్రపంచంతోపాటు ఆసియాలోని అనేక దేశాల వారసత్వంతో అనుబంధం ఉందని అన్నారు.

- Advertisement -

నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు కూడా పాలుపంచుకున్నాయని, ఆయా స్నేహపూర్వక దేశాలను అభినందిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. నలందలోని ఈ కొత్త క్యాంపస్ భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నదని మోదీ పేర్కొన్నారు. బలమైన మానవ విలువలపై నిలబడే దేశం మనదని, చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం ఎలాగో మనకు తెలుసన్నారు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం, ఒక అమోఘ కథ… నలంద అనంత సత్యానికి నిదర్శనం. పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు. కానీ అవే అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
నలంద విశ్వవిద్యాలయం భారతీయ ఆత్మ వంటిదని.. నలంద అంటే జ్ఞానాన్ని అందించే విద్యా కేంద్రం అని అన్నారు. ఒకప్పుడు విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకున్నారని.. నాడు ప్రపంచంలోనే ఓ ప్రముఖ విద్యాకేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం విరాజిల్లిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. అంతకు ముందు మోడీ విదేశీ రాయబారులతో కలిసి యూనివర్సిటీ ముందు నిల్చోని ఫోటోలు దిగారు. అలాగే ప్రారంభోత్సవం సందర్భంగా రాయబారులతో కలిసి మొక్కలను నాటారు.

సభలో పాల్గొన్న బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆశీస్సులతో నలంద యూనివర్శిటీ క్యాంపస్ ప్రారంభం కావడం సంతోషించదగిన విషయమని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారన్నారు. దురదృష్టవశాత్తు ఈ విశ్వవిద్యాలయం 1200 ఏడీలో ధ్వంసమైందన్నారు. 2005 నుంచి తాము బీహార్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement