Tuesday, November 19, 2024

Bharat Jodo: మోడీ ప్రభుత్వం.. గిరిజన హక్కులను కాలరాస్తోంది: రాహుల్‌ గాంధీ

ఆదివాసీల సాధికారత కోసం ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) రూపొందించిన చట్టాలను నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తమపార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని అన్నారు. ఆదివారం మహారాష్ట్రల4ని బుల్దానా జిల్లాలోని జల్గావ్‌-జామోద్‌లో జరిగిన ఆదివాసీ మహిళా కార్మికుల సమ్మేళనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గిరిజనులు దేశంలో మొదటి యజమాను. ఇతర పౌరుల మాదిరిగానే వారు సమాన హక్కులు కలిగివున్నారు. అటవీ హక్కులు, భూమి హక్కులు, పంచాయతీ రాజ్‌ చట్టాలు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి చట్టాలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అని రాహుల్‌ ధ్వజమెత్తారు.

ప్రధాని మోడీ గిరిజనులను వనవాసీలు అని పిలుస్తున్నారు. ఆదివాసి, వనవాసి పదాలకు వేర్వేరు అర్ధాలు ఉన్నాయి అని తెలిపారు. వనవాసి అంటే మీరు అరణ్యాలలో మాత్రమే జీవించేవారు. నగరాల్లో కాదు. మీరు డాక్టర్‌, ఇంజనీర్లు కాలేరు. విమానంలో ప్రయాణించలేరు. గిరిజనుల భూమిని లాక్కొని తన పారిశ్రామిక స్నేహితులకు ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నారు అని రాహుల్‌ ఆరోపించారు. మేము అధికారంలోకి రాగానే ఈ చట్టాలను బలోపేతం చేస్తాం. మీ సంక్షేమం కోసం కొత్త చట్టాలను రూపొందిస్తాం అని భరోసా ఇచ్చారు. ఆదివాసీలే దేశానికి తొలి యజమానులని తన నానమ్మ ఇందిరాగాంధీ పేర్కొన్నట్లు గుర్తుచేశారు. గిరిజనుల సంస్కృతి, చరిత్రను అర్థం చేసుకోకపోతే దేశాన్ని అర్థం చేసుకోలేమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement