ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఇవ్వాల (మంగళవారం) జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్, టిఆర్‌ఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్‌రెడ్డిలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. బీజేపీ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని 18 వేల కోట్ల రూపాయలకు కొని ఆయనను బలిపశువు చేసిందని విమర్శించారు.
మునుగోడులో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను దేశం మొత్తం అమలు చేయాలని వాటిని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి మాట్లాడాలని దయాకర్‌రావు డిమాండ్ చేశారు. దేశంలో సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజల నడ్డి విరిచే విధంగా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. అక్కరలేని ఎన్నిక తెచ్చిన బీజేపికి మునుగోడు ప్రజలు తగిన బుద్ది చెప్పారని, అందుకు మునుగోడు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు.
మునుగోడు ప్రజలు కేసీఆర్‌ను దీవించారు భారతదేశ భవిష్యత్తును బంగారు మయం చేయడానికి మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని దీవించారని, మునుగోడు గెలుపు దేశాభివృద్దికి ములుపు అవుతుందని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు మత విధ్వేషాలను రెచ్చగొట్టి కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ.. మునుగోడు ప్రజలు ఆ ధర్మానికి బుద్ది చెప్పి ధర్మాన్ని గెలిపించడంతో పాటు ఢిల్లి ఆహంకారంపై దెబ్బకొట్టారన్నారు. మునుగోడు విజయం ముమ్మాటికీ తెలంగాణ ఆత్మగౌరవ విజయమని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్బంగా కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలుచేయలేదని, బయ్యారం ఉక్కుఫ్యాక్టరి తేలేని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను తీసుకరాలేని దద్దమ్మ మంత్రి దయాకర్‌రావు విమర్శించారు. దేవుళ్లను అడ్డంపెట్టుకొని నాటకాలు ఆడుతున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా భాగ్య లక్ష్మీ టెంపుల్‌ను, గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్బంగా శ్రీ భద్రకాళీ అలయాన్ని, మునుగోడు ఉపఎన్నికల కోసం యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిఆలయాన్నిఅడ్డుపెట్టుకొని నాటకాలు ఆడారని, వారి నాటకాలకు ప్రజలు తీర్పునిచ్చారని మంత్రి దయాకర్‌రావు అన్నారు.