- శ్రీనగర్ – సోనామార్గ్ కు జెట్ స్పీడ్ లో ప్రయాణం
- 6.4 కిలో మీటర్ల టన్నెల్.. రూ.2400కోట్ల ఖర్చు
- పదేళ్ల పాటు కొనసాగిన నిర్మాణం
శ్రీనగర్- లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్-మోర్ టన్నెల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఆ ప్రతిష్టాత్మక టన్నెల్‌ను నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 2015లో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. తాజాగా ప్రధాని ఈ టన్నెల్‌ను ప్రారంభించారు.
సెంట్రల్ కశ్మీర్ లోని గాంధర్‌బల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగ మార్గాన్ని రూ.2400 కోట్లతో దాదాపు పదేళ్ల పాటు నిర్మించారు. సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో 6.4 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ సొరంగమార్గం 7.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగం ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శ్రీనగర్, సోనామార్గ్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంతకు ముందు ఈ రహదారి గుండా గంటకు 30 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చింది.
తాజా టన్నెల్‌తో వేగ పరిమితి గంటకు 70 కి.మీ. పెరగనుంది. ఈ టన్నెల్ గుండా గంటకు వెయ్యి వాహనాల రాకపోకలు సాగించవచ్చు. ఏడాది పొడవునా ఈ టన్నెల్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. శీతాకాలంలో తీవ్ర హిమపాతం ఉన్నప్పటికీ రవాణాకు ఆటంకం లేకుండా టన్నెల్ ద్వారా ప్రయాణం సాగించవచ్చు.