ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఎనిమిదేళ్లు పూర్తి అయింది. మోడీకి ప్రజాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఇండియాటుడే- సీ ఓటర్ నిర్వహించిన సంయుక్త సర్వేలో వెల్లడైంది. గత రెండేళ్లుగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఓవైపు… మరోవైపు కొవిడ్-19 సంక్షోభం, పెట్రోల్ ధరల మంట తదితర సమస్యలతో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం సతమతమవుతోంది. అయినా ప్రధానిగా నరేంద్రమోడీకి ప్రజాదరణ మాత్రం తగ్గలేదు. 53శాతం మంది ప్రజలు తదుపరి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ కొనసాగాలని కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. మోడీ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 9 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 7శాతం మంది మాత్రమే ప్రధానిగా ఆమోదం తెలిపారు. మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
మోడీ నాయకత్వంవైపే అత్యధికులు మొగ్గుచూపుతారని, కానీ 2019లో వచ్చిన సీట్ల కంటే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని పేర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు చేజిక్కించుకోగా, ఈసారి 286 సీట్ల వరకు వచ్చే అవకాశముందని సర్వే వెల్లడించింది. అయితే కాంగ్రెస్ బలం మరింత ఇనుమడిస్తుందని, గత ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, ఇప్పుడు 146 వరకు సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇండియాటుడే – సీ ఓటర్ సర్వే వివరించింది. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర బాగుందని 40శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 34శాతం మంది మాత్రమే బాగాలేదని పెదవి విరిచారు. ఆధునిక కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ అయితేనే సరైన వ్యక్తి అని 23శాతం మంది అభిప్రాయపడ్డారు. 16శాతం మంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 14శాతం సచిన్ పైలట్ అయితే బాగుంటుందని పేర్కొన్నారు. కేవలం 9శాతం మంది మాత్రమే ప్రియాంక గాంధీ వాద్రా వైపు మొగ్గుచూపారు. కానీ, రాహుల్‌గాంధీని ప్రధానిగా 9శాతం మందే కోరుకుంటున్నారట. మోడీ ప్రధానిగా ఉండాలంటూ 53శాతం మంది కోరుకుంటున్నారని సర్వే తెలిపింది. ఇండియా టుడే- సీ ఓటర్ సంస్తలు ఈ సర్వేని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో చేపట్టాయి. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇలాంటి సర్వేనే ఇండియా టుడే చేపట్టింది. అప్పటికి, ఇప్పటికి పెద్దగా మార్పేమీ కనిపించలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.