Friday, November 22, 2024

TS | నిజాంసాగర్‌ ఆధునీకరణ.. మరో రూ.127 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సాగునీటి రంగంలో పెండింగ్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వేలకోట్ల అంచనా వ్యయాలు పెరిగినప్పటికీ ఆధునీకరణకు నోచుకోని ప్రాజెక్టులను పునరుద్ధరించి వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తుంది. ఎప్పటికప్పుడు నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈనేపథ్యంలో తెలంగాణలో నిజాంరాజులు తొలిసారిగా రూపొందించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు పై రేవంత్‌ రెడ్డి సర్కార్‌దృష్టి సారించింది. ప్రాజెక్టు కాలువలను ఆధునీకరించడంతో పాటుగా పూడికలు తీసి నీటినిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టింది.

ప్రాజెక్టు నిర్మించి శతాబ్దకాలమైనా ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడంతో నిర్దేశిత లక్ష్యానికి నిజాంసాగర్‌ దూరంగానే ఉంది. మంజీర నదిపై 1923లో నిర్మాణం ప్రారంభించి 1931లో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు లక్ష్యం 29.72 ఎకరాలు కాగా ఇప్పటికీ 17.91 టీఎంసీ కే పరిమితమైంది. ఆధునీకరణ పేరుతో ప్రణాళికలు రూపకల్పన చేసిన అంచనా నిధుల పేరుతో జీఓ లు విడుదలైనా ఆధునీకరణ పనులు అరకొరగానే జరగడంతో ఇప్పటికీ పూర్తి స్థాయి లక్ష్యం చేరుకోలేక పోయింది. అయితే తొలిసారిగా 1972లో ప్రాజెక్టును ఆధునీకరించే ప్రయత్నం జరిగింది. 1200 నుంచి 1400 ఎఫ్‌ ఆర్‌ ఎల్‌ పెంచారు.

అయితే ఆతర్వాత 1992-93వరకు ప్రాజెక్టు ఇన్‌ప్లో స్థిరంగానే ఉంది, అనంతరం పాలకవర్గాలు ప్రణాళికలకే పరిమితం కాగా పూడిక పెరిగి 8 టీఎంసీలకు చేరుకుంది, ఈ నేపథ్యంలో 2005-2006లో పూడికతీత కొంత మేరకు తీసి నీటిసామర్థ్యం పెంచగలిగారు. ఆతర్వాత ప్రాజెక్టు ఆధునీకరణకు ప్రణాళికలు, నిధుల మంజూరు జరిగిందే కానీ ముందుకు కదలలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే నిజాంసాగర్‌ ఆధునీకరణ పేరుతో రూ.742కోట్ల పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చి కాలువల ఆధునీకరణ ప్రారంభించినప్పటికీ సంవత్సరానికి అంచనావ్యయం పెరుగుతోందే కానీ పనులు పూర్తి కాకపోవడంతో ఆయకట్టు స్థిరీకరణ అనేక సవాళ్లనుఎదుర్కొంటుంది.

అనంతరం అనేక పర్యాయాలు అంచనా బడ్జెట్‌ ను సవరించడంతోనే సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజాంసాగర్‌ ఆధునీకరణపై దృష్టి సారించింది. పనుల్లో వేగం పెంచేందుకు ఇటీవల అధికారులు నిజాంసాగర్‌ ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి మరో రూ. 127 కోట్లు అవసరమవుతాయనే అంచనాను రూపొందించారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు పరిధిలో విస్తరించి ఉన్న 155 కిలోమీటర్ల ప్రధానకాలువ, 283ఉపకాలువలు, 82 పంపిణీ కాలువలను ఆధునీకరించడంతో నిజాంసాగర్‌ పూడిక తీయాల్సిన అవశ్యకత ఏర్పడిందని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

1972లో ఈ ప్రాజెక్టుకు హైడ్రాజికల్‌ సర్వే అనంతరం ఇప్పటివరకు సర్వే జరగలేదు. ఈ నేపథ్యంలో త్వరలో హైడ్రాజికల్‌ సర్వే జరగనున్నట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో మంజీర నదిపై తొలిసారిగా నిర్మించిన నిజాం సాగర్‌ నిజాంల పాలనలో నిర్మించిన తొలి ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచిపోయినప్పటికీ ప్రాజెక్టును పదిలపర్చుకునే ప్రయత్నాలు వేగవంతంగా జరగపోవడంతో ఇప్పటికీ ఆధినీకరణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పెండింగ్‌ పనులను పూర్తి చేసి అదనంగా 19వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అదనంగా బాన్సు వాడ, బోధన్‌ నియోజకవర్గాల్లో కాలువల ఆధునీకరణ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement