Tuesday, November 26, 2024

Big Story | స్పీడందుకు కడెం ఆధునీకరణ.. దండకారణ్యంలో జలపాతాల నుంచి వరదలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దట్టమైన దండకారణ్యంలో జలపాతాల నుంచి జాలువారే నీటితో జీవధారగా కీర్తిని ఆర్జించిన కడెం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో నిర్ణీత లక్ష్యానికంటే అత్యధికంగా జలసవ్వడి చేస్తూ సాగుభూములను సస్యశ్యామలం చేసేందుకు నీటిపారుదల శాఖ నిరంతరం చేసిన శ్రమ ఫలిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలం పెద్దూరు గ్రామం దగ్గర గోదావరి నదికి ఉపనది అయిన కడెం నదిపై నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 68 వేల 150 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తుంది. అలాగే గూడెం ఎత్తిపోతల పథకం కింద చిట్టచివర ప్రాంతాల్లోని 30 వేల ఆయకట్టు ఈ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ జరిగింది.

అయితే నిజాం రాజుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకరణ అనివార్యమైంది. వర్షాల ఉధృతికి గేట్లు కొట్టుకు పోవడం, గేట్ల పైనుంచి నీరు ప్రవహించడంతో ఆనేక సమస్యలు ఉత్పన్నమైన సంఘటనలున్నాయి. ప్రధానంగా 1958లో 9గేట్ల నుంచి 2.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక గేట్ల పైనుంచి నీరు వెళ్లడం, 1968లో 7.60 టీఎంసీల నీరు గేట్ల పైనుంచి ప్రవహించడంతో ఉత్పన్నమైన సమస్యలకు ఆనాటి ప్రభుత్వాలు తాత్కాలిక మరమ్మత్తులను చేపట్టాయి. అయితే గతసంవత్సరం కురిసిన భారీవర్షాలు కడెం ప్రాజెక్టు తిరిగి సమస్యల వలయంలోకి నెట్టగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది.

- Advertisement -

రూ.84.15 లక్షలతో ఎడమ ప్రధాన కాలువ క్రాస్‌ రెగ్యులేటర్‌ కి.మీ. 58.59 నిర్మాణం కోసం పరిపాలనాపరమైన అనుతులు ఇవ్వడంతో టెండర్లు ఖరారు చేశారు. గేట్‌ నంబర్‌ 2 మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. మిగిలిన పనులకోసం రూ.5 కోట్ల అంచనాలతో జూన్‌ 2023లోగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించి పనులు ప్రారంభించారు. డి- 42, డి-13 ఆధునీకరణ పనులకోసం రూ.46 కోట్ల 69లక్షలతో పనులు పూర్తి చేశారు. అలాగే ప్రస్తుతం కడెం ప్రాజెక్టు కాలువల వ్యవస్థలపై డి-13, డి-42 కాలువల ఆధునీకరణ పురోగతిలో ఉన్నాయి. గేట్‌ నంబరు 2తో పాటు హెడ్‌ వర్క్‌ పనులు నీటి పారుదలశాఖ శరవేగంగా పూర్తి చేస్తుంది.

ప్రస్తుత జులై నెల చివరివరకు ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రతిపాదిత సామర్థ్యం మేరకు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. అలాగే కడెం ప్రాజెక్టు పరిధిలోని 26 వేల 282 ఎకరాల గ్యాప్‌ ఆయకట్టుకు నీరు అందించేందుకు కడెం డ్యాం ఎగువన కుప్తి బహుళార్ధక సాధక ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే 350 క్యూసెక్కుల సామర్ధ్యంతో కడెం రిజర్వాయర్‌తో సాదర్‌మఠ్‌ ఆనకట్ట కాలువ అనుసంధానాన్ని రూ. కోటి 62 లక్షలతో ప్రతిపాదించి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఈ ఆధునీకరణ పనులతో కడెం ప్రాజెక్టు భారీ నీటి ప్రవాహాలను సైతం తట్టుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement