న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ రంగంలో నైపుణ్య, అభివృద్ధి అవకాశాలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావుతో చర్చించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన మంత్రి కేటీఆర్ కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో సమావేశమయ్యారు. ఆ భేటీలో చర్చించిన అంశాలపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను అప్ గ్రేడ్ చేయాలని, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను(ఐటీఐ) అధునికీకరించి అప్‌గ్రేడ్ చేయాలని కేటీఆర్ సూచించారని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రితో భేటీ అనంతరం అదేరోజు కేటీఆర్ ట్విట్టర్లో ఫొటోలు పోస్టు చేసి తమ సమావేశం సహృద్భావ వాతావరణంలో సానుకూలంగా సాగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాజీవ్ చంద్రశేఖర్‌తో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలో అవకాశాల గురించి చర్చించామని రాశారు. ఆ పోస్టుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. తెలంగాణలో నైపుణ్య ఎకో సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని తాను కేటీఆర్‌ను కోరానని, అలాగే ఇటీవల ఆకాంక్షాత్మక జిల్లాల్లో ఒకటైన భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలోని ఐటీఐని సందర్శించిన తర్వాత తన అనుభవాలను పంచుకున్నానని, యువతకు మెరుగైన అవకాశాలను అందించడానికి, ఐటీఐలను ఆధునీకరించడం, అప్‌గ్రేడ్ చేయడం తక్షణ అవసరమని ట్వీట్లో అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్తగుడెం పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రుద్రంపూర్‌లోని ఐటీఐని సందర్శించారు. ఆధునిక పారిశ్రామిక శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులను వినియోగించుకోవాలని కేంద్రమంత్రి అధికారులకు సూచించారు. సమగ్ర, స్థిర అభివృద్ధి జాబితాలో ఉన్న12 ఆకాంక్షాత్మక జిల్లాల్లో కొత్తగూడెం ఒకటి. 2018 జనవరిలో ప్రధానమంత్రి ప్రారంభించిన ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందని 112 జిల్లాలను వీలైనంత త్వరగా సమర్థవంతంగా మార్చడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.