Sunday, November 17, 2024

ఓవైపు మండు టెండ మరోవైపు వానలు.. వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయి : వాతావరణ శాఖ

బెంగళూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో ఎండ వేడిమి కొనసాగుతోంది. భానుడి భగ భగలతో తెలంగాణ ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. పలు జిల్లాల్లో గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట జిల్లా మునగాల, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, ఖమ్మం జిల్లా మధిర మండలాల్లో 44.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలోని రావినూతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా పలు జిల్లాల్లో 40కిపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఒకవైపు మండుటెండలు దంచి కొడుతుంటే మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై వానలు కరిశాయి. గచ్చిబౌలి, కొండాపూర్‌, సరూర్‌నగర్‌, నాంపల్లి, అంబర్‌పేట, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, సూరారం, కుత్బుల్లాపూర్‌, సుచిత్ర, కొంపల్లి, చంపాపేట, కర్మన్‌ఘాట్‌, సైదాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీగా ఈదురు గాలులు వీయడంతో నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు ఎగిరిపడి అటుగా వెళుతున్న వాహనాలపై పడ్డాయి. దీంతో నాంపల్లి ప్రధాన రోడ్డు కూడలిలో మూడు కార్లు ధ్వంసం కాగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి షేక్‌పేటలోని మారుతీనగర్‌ వద్ద పెద్ద చెట్టు విరిగి పడింది. పక్కనే పార్కు చేసి ఉన్న ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలపై చెట్టు పడి ఆ వాహనాలు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూలిన చెట్టును తొలగించారు. సుమారు మూడు గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

రానున్న రెండు రోజులపాటు వర్షాలు..

రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దిdవులు, కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ ద్రోణి ఉత్తర కర్నాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement