Tuesday, November 26, 2024

9 ఏళ్లుగా ఎక్కడి వారక్కడే! సుధీర్ఘంగా ఒకే చోట పనిచేస్తున్న మోడల్‌ స్కూల్స్‌ టీచర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఏకంగా 9 ఏళ్లుగా బదిలీలు లేక ఒకే చోట పనిచేస్తూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్న మోడల్‌ స్కూల్‌ టీచర్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. పీజీటీ, టీజీటీలుగా నియామకం జరిగిన కాన్నుంచి ఆ స్కూల్ల‌లోనే గత తొమ్మిది సంవత్సరాలుగా పనిచేసున్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వీరు బదిలీలు, ప్రమోషన్లకు నోచుకోలేదు. రాష్ట్రంలో మొత్తం 194 మోడల్‌ స్కూళ్లు ఉంటే అందులో దాదాపు 2800 మంది టీచింగ్‌ స్టాఫ్‌ ఉంటారు. వీరందరికీ బదిలీలు, ప్రమోషన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మిగతా ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా 2018 నుంచి బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. 2001 నుంచి టీచర్లకు జేఎల్‌ (జూనియర్‌ లెక్చరర్లుగా)గా ప్రమోషన్లు లేవు. 2005 నుంచి ఎంఈవో, డిప్యూటీఈవోలుగా పదోన్నతులు కల్పించలేదు. అలాగే 2015 నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఈనేపథ్యంలోనే డీఎస్‌ఈ(డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌) కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రేపు (బుధవారం) టీఆర్‌టీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం ముట్టడికి పిలుపునివ్వగా, గురువారం నాడు తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి.

ఇచ్చిన హామీ ఏమైంది?…

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఈరోజు, రేపు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు తప్పితే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదని టీఆర్‌టీఎఫ్‌ విమర్శించింది. 317 జీవో అమలు విషయంలో నెలకొన్న పరస్పర, స్పౌజ్‌ కేసులు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపింది. ఈ జోవోను జారీ చేయడం ద్వారా పుట్టి, పెరిగి చదువుకున్న జిల్లా నుండి శాశ్వతంగా పక్క జిల్లాకు బలవంతంగా నెట్టివేశారని విమర్శించింది. ఒకే జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ కుటుంబాలు జిల్లాల కేటాయింపుల్లో భాగంగా భార్యొక జిల్లా, భర్తొక జిల్లాకు వెళ్లారని ఆరోపించింది. స్పౌజ్‌ టీచర్లకు న్యాయం చేస్తామన్న విద్యాశాఖ, 13 జిల్లాలకు బ్లాక్‌ చేశారని ఆరోపించింది. రివర్స్‌ స్పౌజ్‌లో చాలా మంది ఉపాధ్యాయుల దరఖాస్తులు తప్పిపోయినట్లు ఫెడరేషన్‌ నేతలు ఆరోపించారు. మెడికల్‌ గ్రౌండ్‌, వితంతువు కేటగిరి వారికీ అన్యాయం జరిగిందన్నారు. 2001 నుంచి టీచర్లకు జేఎల్‌ ప్రమోషన్లు లేవన్నారు. 2018 నుంచి ఇంతవరకూ బదిలీల ప్రక్రియ చేపట్టలేదని పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్‌ స్కూల్‌ టీచర్ల న్యాయమైన డిమాండ్లను సైతం వెంటనే పరిష్కరించాలని కోరారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement