బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్‌కు చెందిన రాధాకాంత మందిరంపై ముస్లిం వర్గానికి చెందిన అల్లరిమూకలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డాయి. గత ఏడాది దుర్గా పూజల సందర్భంగా అల్లర్లకు పాల్పడినట్టే ఇప్పుడు కూడా భయభ్రాంతులకు గురిచేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఢాకోలని లాల్‌మోహన్ సాహా వీధిలోని మందిరంపై ఈ దాడి జరిగింది. హోలీ వేడుకలు జరుగుతుండగా గురువారం ఉదయం హజీ షఫియుల్లా అనే వ్యక్తి సారథ్యంలో దాదాపు 200మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నారని హిందూ అమెరికా ఫౌండేషన్ వెల్లడించింది. ఈ దాడిలో ముగ్గురు భక్తులు సుమంత్ర చంద్ర శరవణ్, నిహార్ హల్దర్, రాజీవ్ భద్రా గాయపడ్డారు.
దాడి మొదలైన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చినా వారు స్పందించలేదని ఫౌండేషన్ ప్రతినిధులు ఆరోపించారు. కర్రలు, ఇనుక రాడ్లు, సుత్తులతో ఆలయం గోడలు పడగొట్టారని, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారని, రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ దాడిని ఇస్కాన్ ఇండియా ఖండించింది. 2021లో దుర్గాపూజల (దసరా) సందర్భంగా ఇదే తరహాలో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా బంగ్లాదేశ్‌లో హిందువులు లక్ష్యంగా దాడులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.