జూన్ 2వ తేదీన ఆవిర్భావ దశమ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వసన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.
ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించబోతోంది. దీనికోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.లోగోతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్నీ విడుదల చేస్తారు రేవంత్ రెడ్డి అదే రోజున.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.ఈ గీతానికి మ్యూజిక్ కంపోజింగ్ ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కీరవాణి చేసారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గేయ రచయిత అందె శ్రీ, అద్దంకి దయాకర్.. తదితరులు ఇందులో పాల్గొన్నారు.
వారికి ట్యూన్లను వినిపించారు కీరవాణి.నేపథ్య గాయకుడు ఎల్ వీ రేవంత్ సహా కొందరు ప్లేబ్యాక్ సింగర్లు.. జయ జయహే తెలంగాణ గేయాన్ని పాడి వినిపించారు. అందెశ్రీ రాసిన గీతం ఇది. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగుతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతాన్ని ఇదివరకే రాష్ట్ర గేయంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర వేడుకలు, తెలంగాణ లిబరేషన్ డే సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జాతీయ గీతంతో పాటు ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.