Tuesday, November 26, 2024

టీచర్ల కేటాయింపులో ఎమ్మెల్సీల తీరు బాలేదు.. హర్ట్ అయిన ఉపాధ్యాయ వర్గం..

నూతన జిల్లాలకు టీచర్ల కేటాయింపు విషయంలో స్థానికత, సీనియారిటీ తదితర అంశాల్లో తమకు అన్యాయం జరుగుతోందని దాదాపు నెలరోజులుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేపడుతున్నా.. ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీచర్‌ ఎమ్మెల్సీలు మాత్రం పత్తాలేకుండా పోయారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. టీచర్ల కేటాయింపుపై జిల్లాల్లో రచ్చ జరుగుతున్నా వాళ్లు మాత్రం ముఖం చాటేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీల తీరుపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాము ఎన్నుకున్న ఎమ్మెల్సీలు ఎక్కడా? అని ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తోంది. కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోతున్నామని, సీనియారిటీలో అన్యాయం జరుగుతోందని, భార్యభర్తల అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే బదిలీలు చేపడుతున్నారని ఉపాధ్యాయుల వాదన. దీంతో గత నెలరోజులుగా టీచర్ల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు, మంత్రులకు మొరపెట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తనపనిని చేసుకుంటూ వెళ్తోంది.

ఈనేపథ్యంలో 317 జీవోపై ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ జీవో కారణంగా తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తమకు తీవ్ర నష్టం జరగడమే కాకుండా తాము స్థానికతను కోల్పోతున్నామని వాపోతున్నారు. ఆప్షన్‌ ఒక చోట ఇస్తే తప్పుగా నమోదు చేసి మరో చోటికి కేటాయిస్తున్నారని, సీనియారిటీ లిస్ట్‌ తయారీ చేస్తున్నప్పుడు అన్ని చోట్ల ఒకే ప్రాతిపదిక తీసుకోలేదని టీచర్లు ఆరోపిస్తున్నారు. దాదాపు 22 వేల మంది తమ జిల్లా కాకుండా వేరే జిల్లాలకు బదిలీ అవుతున్నారు. దీంతో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న ఉపాధ్యాయులు అధికారుల చుట్టూ తిరుగడమే కాకుండా కార్యాలయాల ముందు నిరసనలకు దిగి తమకు న్యాయం చేయాలని గెత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడ్తున్నారు.

ఈ సమయంలో ఆందోళనకు గురవుతున్న టీచర్లకు అండగా ఉండాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పత్తాలేకుండా పోయారని ఉపాధ్యాయ నేతల నుంచి విమర్శులు వస్తున్నాయి. ఎమ్మెల్సీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. టీచర్ల కేటాయింపుల విషయంలో ఇంత గందరగోళం జరుగుతున్నా వారు ఎక్కడికి పోయారని మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు టీచర్‌ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇద్దరు పీఆర్‌టీయూ నుంచి అయితే యూటీఎఫ్‌ నుంచి ఒకరు. వీరెవరూ కూడా ఇప్పటి వరకు టీచర్లకు భరోసా కల్పించే విధంగా మాట్లాడలేదని ఉపాధ్యాయ వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement