ఎన్నికల్లో పోటీలోనే లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికే తీవ్ర విఘాతమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోనె ప్రకాష్‌రావు మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో అరాచకాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సారంగపూర్ జెడ్పీటీసీ పి. రాజేశ్వర్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు పత్రాలు సమర్పించారని అన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉన్న జిల్లా కలెక్టర్ నిజానిజాలు తెలుసుకోకుండా విత్‌డ్రాను ఆమోదించారని ఆరోపించారు.
ఆదిలాబాద్ కలెక్టర్ ఛాంబర్‌లో మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు అందరూ కలిసి బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణ చేపట్టారని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోనూ ఎంపీటీసీల రాష్ట్ర అధ్యక్షులు శైలజా రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా, టీఆర్ఎస్ నేతలు ఆమె చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చింపేశారని వివరించారు. మీడియా కెమెరాల ముందు జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా సరే అటు కలెక్టర్, ఇటు పోలీసులు ఎవరూ కూడా కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాంపులు ఏర్పాటు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులిచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలని కోరానని గోనె ప్రకాష్‌రావు తెలిపారు. ఆదిలాబాద్, రంగారెడ్డి ఘటనలపై సీసీటీవీ ఫుటేజి, మీడియా కథనాల ఆధారంగా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన క్యాంపులపై ఈడీతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరానన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital