హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈ నెల 10వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహించనున్న కార్యక్రమంలో 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఆమె పాల్గొంటారు. ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామళై, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల కవిత చాటి చెప్పనున్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర బడ్జెట్ వల్ల సామాజికంగా జరిగే లాభాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై చూపించే సానుకూల ప్రభావం గురించి వివరించనున్నారు. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు.