Friday, November 22, 2024

ఢిల్లీ టూర్​లో ఎమ్మెల్సీ కవిత.. మహిళల అవార్డు ప్రోగ్రామ్​కు అతిథిగా హాజరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ నిర్వహించిన ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న కవిత, సాయంత్రం ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యారు. ఆమెతో పాటు రాష్ట్రీయ లోక్‌దళ్ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జయంత్ చౌదరి, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, జేడీ(యు) మాజీ ఎంపీ కేసీ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసీ సంస్థ అవార్డులను అందించింది. అందులో బాక్సింగ్‌లో భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటిన తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఒకరు. కవిత చేతుల మీదుగా అవార్డును అందించగా నిఖత్ జరీన్, ఆమె తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -

నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమని నిఖత్ జరీన్ తండ్రి ఎండి జమీల్ అహ్మద్ అన్నారు. అవార్డుల ప్రధాన వేదికపై మాట్లాడిన జమీల్ అహ్మద్ నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఒక తండ్రిగా తాను చేసింది కొంతేనని, కేసీఆర్, కవితల సహకారం లేకపోతే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేది కాదని జమీల్ అహ్మద్ భావోద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం కవిత హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement