న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో కలకలం రేపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఆరోజు కోర్టు లిస్టులో ఉన్న అన్ని కేసులు పూర్తయ్యాకే ఈ కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రాష్ట్ర హైకోర్టు సీబీఐకు అప్పగించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. రాష్ట్ర సర్కార్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, బీజేపీ తరఫున సీనియర్ అడ్వకేట్ మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేదిగా ఉందని, నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవని దవే వాదించారు. కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. అసలు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏముందని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ కేసును ఎలా విచారణ చేస్తుందని సందేహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో వాదనలు వినిపించడానికి తమకు ఎక్కువ సమయం కావాలని దవే కోర్టును కోరారు.
ఈడీ, సీబీఐ, పలు కేసులకు సంబంధించి విచారణ అంశాలను మీడియాకు లీకు చేస్తున్నారనే విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ముఖ్యమంత్రే స్వయంగా మీడియాకు వెల్లడించారని జెఠ్మలానీ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 27న చేపట్టనున్నట్టు తెలిపింది.