దేశంలో కరోనా సెకండ్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండడంతో వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఏపీలో 3, తెలంగాణలో 6 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు చేపట్టాల్సి ఉంది.
ఏపీలో 3 స్థానాలకు ఈ నెల 31తో గడువు ముగియనుండగా, తెలంగాణలోని 6 శాసనమండలి స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనుంది. అయితే, సీఈసీ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఈసీ పేర్కొంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.