Saturday, November 23, 2024

Delhi | ఎంత పని చేసినా నాపై దుష్ప్రచారం.. పార్టీ స్థితిగతులపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో నేతలపై సొంత పార్టీ నేతలే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపురించిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశానికి వెళ్లడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత బతుకు బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదని జగ్గారెడ్డి వాపోయారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. పార్టీ కోసం ఎంత చేసినా నన్ను ప్రశ్నిస్తున్నారని, శీల పరీక్ష పెడుతూనే ఉన్నారని విమర్శించారు.

- Advertisement -

కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్ధం కావడం లేదన్నారు. అన్ని విషయాలు నిర్మొహమాటంగా రాహుల్ గాంధీకి చెబుతానని వెల్లడించారు. అధిష్టానం పిలిస్తేనే ఢిల్లీ వచ్చానే గానీ తాను పైరవీలు చేసుకునే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వ్యుహాలపై చర్చ కోసం రాహుల్ గాంధీ పిలిచారని చెప్పారు. పార్టీ ఐక్యంగా ఉందో లేదో తాను చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా బరస్ట్ అవ్వడం వెనుక బలమైన కారణం ఉందని జగ్గారెడ్డి నొక్కి చెప్పారు. ఎంత ఆవేదనకు గురైతే ఆయన అలా రియాక్ట్ అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. అంతకు మించి ఆయన మాట్లాడిన విషయాలపై తాను స్పందించలేనని జగ్గారెడ్డి చెప్పారు.

సమావేశం పూర్తయ్యాక రాహుల్ గాంధీ జగ్గారెడ్డిని వెంటబెట్టుకుని ఏఐసీసీ కార్యాలయం బయటి లాన్స్‌లోకి తీసుకొచ్చారు. బయటే కాసేపు ఆయనతో విడిగా మాట్లాడారు. అనంతరం సమావేశం గురించి జగ్గారెడ్డిని మీడియా ప్రశ్నించగా కలిసి పని చేసుకోవాలని రాహుల్ సూచించారని తెలిపారు. అంతర్గత విభేదాలు, పొరపొచ్చాలు ఏమున్నా తమ దృష్టికి తీసుకు రావాలని, తాను పరిష్కరిస్తానని రాహుల్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. సంగారెడ్డిలో పరిస్థితుల గురించి ఖర్గే, రాహుల్ అడిగి తెలుసుకున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement