హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు లాంఛనమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉప ఎన్నికతో ఈటల పతనం ఖాయమన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ నేపథ్యం గుర్తించి ఆయనకు హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు సీఎం అవకాశం కల్పించారు. దళితబంధు పథకం చారిత్రాత్మక నిర్ణయమని, దళితుల ఆర్ధిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే దళిత బంధు పథకానికి ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల నిధులు విడుదల చేసిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గురువారం కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కే ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఇందిరాపార్క్ వద్ద బ్యానర్.. పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు