Tuesday, November 26, 2024

ఎమ్మెల్యేల ఎర కేసు.. సుప్రీంను ఆశ్రయించిన టీ సర్కార్‌.. వచ్చే వారం విచారణకు అనుమతిస్తామన్న సీజేఐ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు-చేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. దీన్ని వెంటనే విచారణకు తీసుకోవాలని న్యాయవాది దుష్యంత్‌ దవే సుప్రీంను కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని కోర్టుకు దుష్యంత్‌ దవే ఆందోళన వెలిబుచ్చారు.

బుధవారం నాడు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్‌ దవేకు సీజేఐ చంద్రచూడ్‌ సూచించారు. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సీజేఐ తెలిపారు. ఒకవేళ రేపు మెన్షన్‌ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని చంద్రచూడ్‌ తెలిపారు. అంతకుముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకించిన తెలంగాణ సర్కార్‌ సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.

- Advertisement -

సీఎం ప్రెస్‌మీట్‌ జోక్యం పరిధిలోకి రాదు..

ముఖ్యమంత్రి దీనిపై పత్రికా సమావేశం పెట్టడం దర్యాప్తులో జోక్యం కిందికి రాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక రాజకీయ పార్టీ చట్టబద్ధంగా, తన రాజకీయ లక్ష్యాల మేరకు చేసిన రాజకీయ కార్యక్రమంగానే చూడాలని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచిఉందని సీఎం చెప్పడంలో తప్పులేదని తెలిపారు. నిందితులకు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి మధ్య జరిగిన సంభాషణల ఎలక్ట్రాన్రిక్‌ ఆధారాలు అప్పటికే జనబాహుళ్యంలో ఉన్నాయని.. వాటిని ముఖ్యమంత్రికి పోలీసులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఆ ఆధారాలను సీఎం వివిధ హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు పంపడం దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కిందికి రాదని పేర్కొన్నారు. నిందితులు బేరసారాలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని.. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement